South Central Railway: రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway -SCR) కీలక సూచనలు చేసింది. తమ పరిధిలో నడిచే పలు ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్ల సమయాల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. ఈ మార్పులు అక్టోబర్ 11 – 15 మధ్య అమల్లో ఉంటాయని తెలిపింది. కాబట్టి మారిన టైమింగ్స్ కు అనుగుణంగా ప్రజలు.. తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
సమయాలు మారిన రైళ్లు..
సర్దుబాటుకు గురైన రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు. వారి ప్రకారం.. బోధన్ – కాచిగూడ ప్యాసింజర్ రైలు (Bodhan–Kacheguda Passenger) (నెం. 57414) ఇకపై ఉ.11.30 గం.లకు కాచిగూడకు చేరుకోనుంది. 57412 నెం. కలిగిన కాచిగూడ – గుంటకల్ ప్యాసింజర్ రైలు (Kacheguda–Guntakal Passenger).. కాచిగూడ నుండి బయలుదేరే సమయం ఉ.11:45కు మార్చబడింది. అలాగే కర్నూల్ టౌన్ – నంద్యాల ప్యాసింజర్ (రైలు నెం. 77209), హెచ్. నిజాముద్దీన్ – కోయంబత్తూర్ ఎక్స్ ప్రెస్ (H. Nizamuddin–Coimbatore Express) (రైలు నెం. 12648), ఔరంగాబాద్ – గుంటూరు ఎక్స్‌ప్రెస్ (Aurangabad–Guntur Express) (రైలు నెం. 17254) రైళ్ల టైమింగ్స్ కూడా మారాయి. కాబట్టి ప్రయాణికులు ఈ మార్పులు గమనించి.. తమ ప్రయాణానికి సిద్ధం కావాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
Also Read: Monkeys Attack: హుజూరాబాద్‌లో వానరాల వీరంగం.. వేటాడి, వెంటాడి దాడి.. వణికిపోతున్న ప్రజలు
32 రైళ్లు రద్దు..
మరోవైపు డోర్నకల్ – పాపటపల్లి రైల్వే మార్గంలో మరమ్మతు పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ మార్గం గుండా ప్రయాణించే 32 రైళ్లను పాక్షికంగా వారం రోజులపాటు రద్దు చేసింది. రద్దైన వాటిలో విశాఖ – న్యూదిల్లీ మధ్య తిరిగే ఏపీ ఎక్స్ ప్రెస్, స్వర్ణజయంతి ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్ – గుంటూరు ఇంటర్ సిటీ తదితర రైళ్లు ఉన్నాయి. అలాగే సికింద్రాబాద్ – గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు సైతం ఈ నెల 14-18 తేదీల మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.
