Son Kills Mother: బాలాజీనగర్‌లో దారుణ హత్య
తల్లి సహజీవనమే కారణం… తనయుడి చేతిలోనే మృతి
మేడ్చల్, స్వేచ్ఛ: సహజీవనం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తల్లి వివాహేతర సంబంధాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ కొడుకు, జన్మనిచ్చిన ఆమె మృతికి కారకుడయ్యాడు. ఈ విషాద ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జవహర్ నగర్ ఎస్‌హెచ్‌వో సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం… విఘ్నేశ్వర కాలనీలో నివాసముంటున్న పొట్టోళ్ళ రజిని (40) తన ఇద్దరు కొడుకులు, ఒక కూతురితో కలిసి నివాసం ఉంటోంది. అయితే, రజనీ గత కొంతకాలంగా జమీల్ (38) అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ విషయం ఆమె చిన్న కొడుకు రాజ్ కిరణ్‌కు (24) నచ్చకపోవడంతో, జమీల్‌పై తీవ్రమైన కోపం పెంచుకున్నాడు.
Read Also- Women Empowerment: మహిళల స్వావలంబనే.. కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం.. మంత్రి దామోదర రాజనర్సింహ
ఇటీవల రాజ్ కిరణ్ దొంగతనాలకు పాల్పడుతున్నాడంటూ జమీల్ వెళ్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మరింత ద్వేషం పెంచుకున్నాడు. జమీల్‌ను ఎలాగైనా హతమార్చాలనే ఉద్దేశంతో తన స్నేహితులు కృష్ణ, సోయబ్, సోయల్, మాలిక్‌లకు ఈ విషయాన్ని తెలిపాడు. ఈ నెల 15న జమీల్‌ను తన ఇంటికి పిలిచిన రాజ్ కిరణ్, స్నేహితులతో కలిసి మద్యం తాగించాడు. అనంతరం జమీల్ ఇంటికి వెళ్తుండగా అతడిపై దాడికి పాల్పడ్డారు. అయితే, జమీల్‌ను కొట్టవద్దంటూ రజని మధ్యలోకి రావడంతో గొడవ మరింత తీవ్రమైంది. ఆవేశానికి లోనైన రాజ్ కిరణ్ ఇంట్లో నుంచి కత్తిని తీసుకొచ్చి జమీల్‌పై విసిరేయగా, అది తప్పిపోయి రజిని కంటిపై బలంగా తగిలింది.
Read Also- Ramya Rao: అక్రమ దందాలపై.. బీఆర్ఎస్ మాజీ ఏంపీ జోగినపల్లి సంతోష్‌పై ఈడీకి ఫిర్యాదు.!
తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఈ నెల 17న రజిని మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో రజిని మృతికి కారణమైన రాజ్ కిరణ్, అతడి స్నేహితుడు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

