Harish Rao: ఎస్ఎల్బీసీ (SLBC) ఘటనలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని.. ఏజెన్సీలను సమన్వయం చేయడంలో కూడా సర్కారు వైఫల్యం కనిపిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదని ఆరోపించారు. రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) వేగంగా చేపట్టడం లేదని విమర్శించారు.
మంత్రులు ఘటనా స్థలానికి హెలికాప్టర్లలో వెళ్తూ టీవీల్లో ఇంటర్వ్యూ ఇచ్చేందుకు పోటీ పడుతున్నారని, సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యారని ధ్వజమెత్తారు. టన్నెల్ చిక్కుకుపోయిన వారి ప్రాణాలు కాపాడటంలో ప్రతి నిమిషం చాలా ముఖ్యమైందని సూచించారు. టన్నెల్ బోరింగ్ మిషన్(TBM)ను బయటకు తీసేందుకు ఇప్పటి వరకు అధికారులు ఓ అంచనాకి రాలేకపోతున్నారన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హెలికాప్టర్ వేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారని.. ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా.. ఎన్నికల ప్రచారం ముఖ్యమా అని సీఎంను హరీశ్ రావు ప్రశ్నించారు. సహాయక చర్యలకు ఇబ్బంది కలగకూడదని, ప్రభుత్వానికి సహకరించాలనే ఉద్దేశంతో నాలుగైదు రోజులుగా తాము సంయమనం పాటించామని కానీ, సహాయక చర్యల్లో ఒక్కడుగు కూడా ముందుకు పడకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పది ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొని.. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా చెబుతున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా… ఎస్ ఎల్ బీసీ బాధిత కుటుంబాలను ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి తమ పార్టీ నాయకులతో కలిసి వెళ్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సహాయక చర్యలను పరిశీలించి తమ తరపున అధికారులకు సూచనలు చేస్తామని చెప్పారు.
Read Also:
kedar selagamsetty Demise: కేదార్ డెత్ మిస్టరీ… కేటీఆర్‌తో లింక్స్ వయా రాజ్ పాకాల