Robbery Gang Arrest: మెదక్ జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల దొంగల ముఠా అరెస్ట్
మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్పీ శ్రీనివాస్ రావు
మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: మెదక్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు మంగళవారం తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని ప్రగతి ధర్మారంలో ఉన్న మహేశ్వరి బిన్నీ రైస్ మిల్లులో జరిగిన దొంగతనం కేసును రామయంపేట పోలీసులు వేగంగా చేధించారు. ఆరుగురు నిందితులు మొహమ్మద్ షాదీ ఖాన్, బహుదూర్, అనిల్, రామ్ కేవల్, ప్రదీప్ సహని, రామ్ కిస్కివత్‌లను అరెస్ట్ చేశారు.
Read Also- Serial Bridegroom: నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్.. వివాహాల చిట్టా పెద్దదే
నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన పనిముట్లను, గూడ్స్ వాహనాన్ని, కొంత నగదు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రామాయంపేట ఎస్సై ఆర్. బాలరాజు దర్యాప్తులో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్‌లను సేకరించి, ఆధారాలను పరిశీలించారు. రామాయంపేట ప్రగతి ధర్మారం క్రాస్ రోడ్డులో వాహనాల తనిఖీలో భాగంగా ఎంహెచ్ 05జే8823 అనే గూడ్స్ వాహనంలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ప్రశ్నించగా, రామాయంపేట కేసుతో పాటు చేగుంట, మెదక్, తూప్రాన్, మనోహరాబాద్, శివంపేట, గౌరారం ప్రాంతాలలో మొత్తం ఎనిమిది దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు.
Read Also- Rangareddy land scam: కాసులిస్తే చాలు.. పట్టాదారులకు తెలియకుండా ప్లాట్లు రిజిస్ట్రేషన్లు
దొంగలించిన వస్తువులను మేడ్చల్‌లోని ఒక షాపులో అమ్ముకున్నట్లు నిందితులు తెలిపారు. పరారీలో ఉన్నమరో ముగ్గురు నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇతర రాష్ట్రం నుంచి కూలీ పని కోసం వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం వస్తువుల విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని ఎస్పీ చెప్పారు. ఈ కేసును వేగంగా చేధించిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, రామయంపేట సీఐ వెంకటరాజా గౌడ్, రామాయంపేట ఎస్సై ఆర్.బాలరాజు, కానిస్టేబుళ్లు నాగభూషణం, భాస్కర్‌లను జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

