Serial Bridegroom: వెల్లడించిన భువనగిరి పోలీసులు
జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలింపు
యాదాద్రి భువనగిరి, స్వేచ్ఛ: భువనగిరి పోలీసులు ఓ నిత్య పెళ్లి కొడుకును (Serial Bridegroom) అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భువనగిరి పట్టణ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన సోమవరపు సురేంద్ర అనే నిందితుడు పలువురు మహిళలను వివాహం చేసుకొని మోసం చేసినట్లుగా గుర్తించారు. ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు అనంతరం అతడి బాగోతం బయటపడింది. క్రిస్టియన్ మాట్రిమోనీలో పరిచయం ఏర్పరచుకుంటూ మైనింగ్, పెట్రోల్ బంక్, కన్సల్టెన్సీ వంటి వ్యాపారాలు ఉన్నాయంటూ నమ్మబలికి పలువురు మహిళల్ని పెళ్లి చేసుకున్నాడు. వారి నుంచి అధిక మొత్తంలో కట్నంగా వసూలు చేశాడు. ఈ మేరకు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆగస్ట్ 2024న బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సంవత్సర కాలం నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. ఫిర్యాదు చేసిన బాధితురాలికి మాయమాటలు చెప్పి 15 లక్షల రూపాయల నగదు, 30 తులాల బంగారు నగలు తీసుకొని మోసం చేసినట్టు తమకు ఫిర్యాదు అందిందని వెల్లడించారు. విచారణ చేపట్టగా ఫిర్యాదు చేసిన మహిళ కంటే ముందే సురేంద్ర కృష్ణవేణి అనే మరొక మహిళను కూడా మోసం చేశాడని, పెళ్లి పేరిట ఆమె నుంచి రూ.12 లక్షల వరకు మోసం చేశాడని తెలిపారు. ఆఖరికి రూ.7 లక్షలకు రాజీ చేసుకొని తప్పించుకున్నాడని పేర్కొన్నారు.
మరో మహిళను మోసం చేశాడని తెలియడంతో కృష్ణవేణి అతడిని వెతుక్కుంటూ, తాజాగా ఫిర్యాదు చేసిన మహిళ ఇంటికి వెళ్లింది. దీంతో, విషయం బయట తెలిస్తే పరువుపోతుందనే భయంతో కృష్ణవేణికి ఫిర్యాదు చేసిన మహిళ తల్లిదండ్రులు రూ.6 లక్షలు ఇచ్చి పంపించారు. ఇక, మధ్యవర్తి జూపల్లి కిరణ్ కుమార్ ద్వారా షైలజా అనే మరో మహిళను కూడా సురేంద్ర రూ.2.50 లక్షలు తీసుకొని మోసం చేసినట్లు తేలింది. అంతేకాదు, ఆ తర్వాత విజయవాడకు చెందిన రత్నకుమారి అనే మహిళ కూడా తన వద్ద లక్షలు రూపాయలు తీసుకొని సురేంద్ర మోసం చేశాడని ఫిర్యాదురాలికి తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇవన్ని చూసి విసుగు చెందిన బాధితురాలు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. వివాహం అయిన తర్వాత కూడా తనను ఇంటికి తీసుకెళ్లకుండా, తరచూ డబ్బులు, ఇంటి పేపర్లు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తూ, శారీరకంగా, మానసికంగా హింసించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇంటికి తీసుకెళ్లడం లేదేంటని ప్రశ్నించగా, ‘‘మీకు నాకు సంబంధం లేదు. మీరు నాకు ఫ్రీడమ్ ఇవ్వడం లేదు’ అంటూ మెసేజ్ పెట్టి తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి, వదిలి పారిపోయినట్లు వాపోయింది. ఇక, నిందితుడికి 2017లో కరీంనగర్‌కి చెందిన ఓ మహిళతో వివాహం జరిగిందని, 2020లో ఆమెతో కూడా విడాకులు తీసుకున్నట్లు విచారణలో తేలిందని సీఐ రమేష్ తెలిపారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడు సోమవారపు సురేంద్రను అరెస్ట్ చేసి విచారణ అనంతరం న్యాయస్థానంలో హాజరు పరిచి, జుడీషియల్ రిమాండ్‌కు పంపించినట్లు తెలిపారు.
Read Also- iBomma Ravi Case: ఐబొమ్మ ఎలా పనిచేస్తుందో.. కళ్లకు కట్టిన ఏసీపీ.. వెలుగులోకి మరిన్ని నిజాలు

