Telangana Police: ‘కంచే చేనును మేస్తే’…సరిగ్గా ఇలాగే ఉంది కొంతమంది పోలీసు అధికారుల తీరు. చట్టాలను అమలు చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారుల్లోనే కొందరు బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. సహోద్యోగినులను వేధిస్తున్న ఘనులు కొందరైతే..ప్రేమ పేరుతో యువతుల జీవితాలతో ఆడుకుంటున్న వారు ఇంకొందరు. కేసుల్లో నిందితులుగా ఉన్న వారి కుటుంబాల్లోని మహిళలపై సైతం లైంగిక దాడులకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. తప్పు బయటపడినా కఠిన చర్యలు తీసుకోక పోతుండటం వల్లనే కొందరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వందలకు పైగా పోలీస్ స్టేషన్లు పని చేస్తుండగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎనభైవేల మంది వరకు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఇరవై శాతం వరకు మహిళా పోలీసులు ఉన్నారు.
బాస్ ఎంత చెబితే అంత
డిసిప్లీనరీ డిపార్ట్ మెంట్ గా చెప్పే పోలీసు శాఖ(Police Dept)లో పై అధికారులు ఎంత చెబితే అంత. పలు సంస్కరణలు తీసుకొచ్చినా ఇప్పటికీ కిందిస్థాయి సిబ్బంది పై అధికారుల మాటకు ఎదురు చెప్పే పరిస్థితి లేదు. దీనినే కొందరు అధికారులు తప్పుడు పనులకు ఉపయోగించుకుంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని లైంగిక వాంఛలు(Sexual desires) తీర్చమని మహిళా సిబ్బందిని వేధిస్తున్నారు. దారికి రాకపోతే విధుల్లో నానా ఇబ్బందులు పెడుతున్నారు. దారుణమైన విషయం ఏమిటంటే సబ్ ఇన్స్ పెక్టర్ స్థాయి మహిళా ఉద్యోగులకు సైతం ఈ తరహా వేధింపులు ఎదురవుతుండటం. దీనికి నిదర్శనంగా గతంలో సంతోష్ నగర్(Santhosh Nagar) సీఐగా పని చేసిన ఓ అధికారి ఉదంతాన్ని పేర్కొనవచ్చు. స్టేషన్ లోనే పని చేస్తున్న ఓ మహిళా ఎస్ఐతోపాటు కానిస్టేబుళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఆయన తీరుతో విసిగిపోయిన బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దాంతో ఉన్నతాధికారులు వెంటనే ఆయనను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
తాజాగా సూర్యాపేట జిల్లాలో
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంకర్ పల్లి(Shankar Pally) స్టేషన్ లో సీఐగా పని చేసిన మరో అధికారిపై కూడా ఇలాంటి ఆరోపణలు రావటంతో ఉన్నతాధికారులు అతన్ని ట్రాన్స్ ఫర్ చేశారు. ఇక, హైదరాబాద్(Hyderabad) సౌత్ జోన్ లోని కాలాపత్తర్ స్టేషన్ సీఐగా పని చేసిన మరో అధికారిపై మహిళా సిబ్బంది ఆన్ లైన్ ద్వారా పై అధికారులకు ఫిర్యాదులు చేశారు. సదరు సీఐ తమపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు తెలియచేశారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఇలాగే ఓ ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ ను వేధిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
దీనిపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అంతర్గత విచారణ జరుపుతున్నట్టు సమాచారం. గతంలో ఈ ఎస్ఐ శాలిగౌరారం సర్కిల్ పరిధిలో పని చేసినపుడు స్థానికంగా ఉండే ఓ మహిళను వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. పెద్దగట్టు జాతర సమయంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్టు కూడా పోలీసు వర్గాలే చెబుతున్నాయి.
బయటివారిని సైతం
మరికొందరు అధికారులు కంప్లయింట్లు ఇవ్వటానికి వచ్చేవారు. ఆయా కేసుల్లోని నిందితుల భార్యలను సైతం టార్గెట్ చేస్తున్నారు. సహాయం చేస్తాం అండగా ఉంటామంటూ నమ్మబలికి ఉచ్ఛులోకి లాగుతున్నారు. కొమురంభీ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ఉంటున్న ఓ యువతి కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరాలని ఆశ పడింది. సహాయం చేస్తాడనుకుని ఎస్ఐ భవానీ సేన్(Bhavani Sen) ను కలిసింది. పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ఇస్తానని పరీక్షలు ఎలా రాయాలో కూడా చెబుతానని నమ్మించిన భవానీ సేన్ ఓ రోజు రాత్రి యువతిని ఇంటికి పిలిపించుకుని అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు కుటుంబీకులకు విషయం చెప్పింది. దాంతో బాధితురాలు అప్పట్లో ఆసిఫాబాద్ డీఎస్పీగా ఉన్న శ్రీనివాస్(DSP Srinivass) కు ఫిర్యాదు చేసింది. బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. పై అధికారులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ భవానీ సేన్ ను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు.
Also Read: Muthyalamma temple: గుడికి రోడ్డు లేక భక్తుల తంటాలు.. పట్టించుకోని అధికారులు
చంపేస్తానని రివాల్వర్ చూపించి
ఇక, మారేడ్ పల్లి స్టేషన్ సీఐగా పని చేసిన నాగేశ్వరరావు(CI Nageshwar Rao) అన్ని హద్దులు దాటేశాడు. టాస్క్ ఫోర్స్ లో పని చేసినపుడు ఓ కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తిని నాగేశ్వరరావు అరెస్ట్ చేశాడు. సదరు వ్యక్తి బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత తన ఫార్మ్ హౌస్ లో ఉద్యోగం ఇచ్చాడు. అయితే, తన భార్య పట్ల నాగేశ్వరరావు వ్యవహరిస్తున్న తీరు నచ్చక ఉద్యోగం మానేసిన ఆ వ్యక్తి వనస్థలిపురం ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డాడు. ఓ రోజు రాత్రి వేళ ఇంటికి వచ్చిన నాగేశ్వరరావు అతని భార్యపై అఘాయిత్యం జరిపాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని రివాల్వర్ చూపించి భార్యాభర్తలను బెదిరించాడు. అక్కడితో ఆగకుండా వారిని తన కారులో ఎక్కించుకుని ఇబ్రహీంపట్నం వైపు తీసుకెళ్లాడు.
కారుకు ప్రమాదం జరగటంతో తప్పించుకున్న భార్యాభర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నాగేశ్వరరావుపై కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత అతన్ని విధుల్లో నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా ఖమ్మం(Khammam) టౌన్ లో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ కూడా యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు వచ్చాయి. తమ సోదరి తప్పిపోవటంతో ఫిర్యాదు ఇచ్చిన అక్కాచెల్లెళ్లు ఆచూకీ తెలిసిందా? అని అడగటానికి వెళ్లగా వారితో మాట కలిపిన సదరు కానిస్టేబుల్ ఆ తరువాత తన అసలు స్వరూపాన్ని చూపించినట్టు సమాచారం. దీనిపై బాధితులు ఫ్యాక్స్ ద్వారా ఐజీ(IG)కి ఫిర్యాదు చేసినట్టుగా తెలియవచ్చింది.
మనోస్థయిర్యం దెబ్బ తింటుంది
ఇలాంటి వారి వల్ల పోలీసు శాఖలో చేరాలనుకునే మహిళల మనోస్థయిర్యం దెబ్బ తింటుందని పోలీసు వర్గాలే అంటున్నాయి. ఇప్పటికే పోలీసు(Police) శాఖలో ఇరవై శాతం మంది కూడా మహిళా సిబ్బంది లేరని తెలిపాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా వెకిలి చేష్టలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ తరహా ధోరణులకు అడ్డుకట్ట వేయవచ్చని అభిప్రాయపడ్డాయి. అలా కాకుండా బదిలీ చేయటమో…కొన్నాళ్లు సస్పెండ్ చేయటం వల్ల పరిస్థితుల్లో మార్పు రాదని వ్యాఖ్యానించాయి.
Also Read: Congress Party Govt: రిజర్వేషన్లు గ్రామాల్లో పరిస్థితిపై సర్కార్ ఆరా
