Jogipet hospital: రాష్ట్ర కమిషనర్ ఆకస్మిక తనిఖీతో బయటపడ్డ నిజాలు
జోగిపేట ఏరియా ఆసుపత్రిలో 23 మందికి కేవలం 4గురు డాక్టర్లే హజరు
డాక్టర్ల సస్పెన్షన్ తప్పదా?
జోగిపేట,స్వేచ్ఛ: డ్యూటీకి రాకున్నా 15 మంది డాక్టర్లు బుధవారం విధులకు హజరైనట్లు డాక్టర్ల హాజరు రిజిష్టర్‌లో ఉండడాన్ని చూసిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ విస్మయం వ్యక్తం చేశారు. బుధవారం జోగిపేటలోని వైద్య విధాన పరిషత్ ఏరియా ఆసుపత్రిని (Jogipet hospital) ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10 గంటల్లోగానే ఆసుపత్రి చేరుకున్న కమిషనర్ ముందుగా డాక్టర్ల హాజరు రిజిష్టర్‌ను తీసుకొని పరిశీలించారు. విధుల్లో ఉన్నట్లు అటెండెన్స్ రిజిష్టర్‌లో సంతకాలు చేసి ఉండడాన్ని గమనించారు. కానీ, డ్యూటీలో నలుగురు మాత్రమే ఉన్నారు. మిగతా వారు ఎక్కడున్నారంటూ కమిషనర్ ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.
Read Also- Davos summit 2026: సీఎం రేవంత్ సంచలనం.. తెలంగాణలో స్టీల్ ప్లాంట్.. దావోస్‌లో గేమ్ ఛేంజింగ్ ఒప్పందం!
డాక్టర్లను తప్పించేందుకు సిబ్బంది ప్రయత్నం చేస్తూ టీ తాగడానికి వెళ్లారంటూ ఆర్‌ఎంవో అశోక్ చెప్పారు. కమిషనర్ వచ్చిన తర్వాత ఆలస్యంగా వచ్చిన ఆర్‌ఎంవోపై కమిషనర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. కమిషనర్ ఆసుపత్రికి వచ్చిన తర్వాత విధుల్లోకి ఆలస్యంగా వచ్చిన అశోక్‌ను కమిషనర్ సిబ్బంది ముందే.. ‘‘అసలు మీకు సిగ్గుందా?, రోజుకొక పత్రికల్లో డాక్టర్ల నిర్లక్ష్యం, విధుల్లో గైర్హాజరీ వంటి కథనాలు వస్తుంటే మీరేం చేస్తున్నారు’’ అని నీలదీశారు. వచ్చిన 15 నిమిషాల్లో కమిషనర్ హల్ చల్ చేశారు. ఇన్చార్జి డాక్టర్‌గా ఉన్న రాజేశ్వరీ ఆసుపత్రి రోగుల వివరాలను కమిషనర్‌కు వివరించినా ఆయన సంతృప్తి చెందలేదు. కమిషనర్ రాకతో ఆసుపత్రిలో కాసేపు టెన్షన్ వాతావరణం కనిపించింది. ఎక్కడి వారక్కడ అటెన్షన్‌లో ఉండే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికిని జోగిపేట ఆసుపత్రిలోని డాక్టర్ల పనితీరుపై మంత్రి దామోదర్ రాజనర్సింహ కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.
Read Also- Honey Teaser: నవీన్ చంద్ర ‘హనీ’ టీజర్ చూశారా.. సైకలాజికల్ హారర్ చెమటలు పట్టిస్తుంది
డాక్టర్ల సస్పెన్షన్ తప్పదా…?
విధులకు హజరు కాకున్నా హజరైనట్లు డ్యూటీ రిజిస్టర్‌లో అటెండెన్స్ వేసుకున్న డాక్టర్లపై చర్యలు తప్పవన్నట్లుగా కమిషనర్ హెచ్చరిక చేశారు. రిజిష్టర్ వివరాలను ఆయన వెంట తీసుకువెళ్లారు. డ్యూటీకి సరిగ్గా రాని వైద్యులపై చర్యలు ఉంటాయన్నారు. విధులకు హాజరుకాకుండా హజరైనట్లు సంతకాలు పెట్టడంపై కమిషనర్ ఆరా తీశారు. ముందుగా విధులకు వచ్చే డాక్టరే.. కల్పించుకొని వారి అటెండెన్స్ రిజిష్టర్‌లో సంతకాలు పెడతారని సిబ్బంది ద్వారా కమిషనర్ తెలుసుకున్నారు. వీరందరిపై చర్యలు తప్పవా అన్న విషయంలో స్థానికంగా చర్చించుకుంటున్నారు.

