Alert for Devotees: శివరాత్రి సందర్బంగా శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. పండుగ నాడు స్వామి వారి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తాజా సమాచారం ప్రకారం ఇవాళ ఒక్కరోజే ఆలయానికి 1.30 లక్షల మంది వచ్చినట్లుగా తెలుస్తోంది. క్యూలైన్లన్ని భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి కీలక ప్రకటన చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా పాగాలంకరణకు కేవలం 8 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని అన్నారు. క్యూ లైన్లో వేచి ఉన్న ప్రతి ఒక్కరికీ స్వామి వారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామని, ఎవరూ సహనం కోల్పోవద్దని సూచించారు. భక్తుల భద్రతను పరిగణనలోకి తీసుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సాధారణ ప్రజల దర్శనానికి వీఐపీలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాబట్టి శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
కాగా, ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం, అనంతరం నంది వాహన సేవను నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి మల్లన్న ఆలయానికి పాగాలంకరణ చేయనున్నారు. అర్ధరాత్రి వరకు శ్రీ మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం జరగనుంది.
మాఘ మాస బహుళ చతుర్ధశి రోజు అనంత భక్త కోటి కోసం మహా శివుడు శివలింగంగా ఆవిర్భవించిన రోజు కావడంతో మహా శివరాత్రిగా పరిగణిస్తారు. శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ ఉండటం సనాతన సంప్రదాయం. శివరాత్రికి ముందు రోజు సైతం ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలంటారు. ఇక, ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు… ఉదయమే స్నానాదులు పూర్తి చేసుకొని శివ దర్శనం చేసుకొని పరమేశ్వర నామస్మరణతో ఉపవాసం వుంటారు. రాత్రివేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగరణ చేస్తారు. శివానుగ్రహం కోసం బిల్వ పత్రాలతో అర్చన, అభిషేకాలు చేస్తారు.
Read Also: