MLA Veerlapalli Shankar: ప్రజలు కార్పొరేట్ వైద్యం చేయించుకోలేక ఉచిత వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తారని వారికి నాణ్యమైన సేవలు అందించాల్సిన వైద్యులు వారి వెసులుబాటు చూసుకొని రోగులను గాలికి వదిలేసి పోతామంటే ఎలా… కొంచమైనా బాధ్యత లేదా.. డిప్యుటేషన్లపై వెళ్తానంటే ఇక్కడ సేవలు అందించేది ఎవరు.. ఎవరి సహకారంతో ఈ డిప్యూటేషన్ల వ్యవహారం నడిచింది.. అంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, వీర్లపల్లి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి కార్యనిర్వహణాధికారి డాక్టర్ విష్ణువర్ధన్ స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి విషయాలను ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారంకోసం సమాలోచనలు చేశారు. ఈ క్రమంలో 8 మంది వైద్యులు డిప్యూటేషన్ పై వెళ్లారని తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ ఇదేం పద్ధతిని ప్రశ్నించారు. ప్రజలకు సేవలు అందిస్తామని ఉద్యోగాల్లో చేరి తమవసులు బాటు కోసం ఇతర చోటికి వెళ్లిపోవడం మంచి సంప్రదాయం కాదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Fake Cotton Seeds:14 లక్షల విలువ చేసే 560 కేజీల.. నకిలీ విత్తనాలు పట్టివేత!
తన నియోజకవర్గంలో పేద ప్రజలకు ఎవరు వైద్య సేవలు అందించాలని అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తదితర అధికారులతో ఎమ్మెల్యే స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ఇది మంచి పద్ధతి కాదని ఇక్కడ ప్రజలు ఏమైపోవాలని అధికారులను ఎమ్మెల్యే శంకర్ నిలదీశారు. తమ సౌలభ్యం సౌఖ్యం కోసం పేదల ప్రాణాలను బలి పెడతారా అలాంటప్పుడు ఈ వృత్తిలోకి ఎందుకు వస్తారని ఎమ్మెల్యే కార్యనిర్వాహణాధికారి డాక్టర్ విష్ణువర్ధన్ ను నిలదీశారు.
డిప్యూటేషన్లను ప్రోత్సహిస్తే సహించను…
ప్రభుత్వ శాఖల్లో అతి ముఖ్యమైన వైద్య ఆరోగ్య శాఖలో షాద్ నగర్ డిప్యూటేషన్ల పర్వం పై ఎమ్మెల్యే శంకర్ తీవ్ర ఆగ్రహం అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ అన్నివేళల్లో ముఖ్యమైన సేవలు అందించడానికి ప్రయత్నిస్తుంటే ఇద్దరు గైనకాలజిస్టులు చర్మ వ్యాధి నిపుణులు ఊపిరితిత్తుల నిపుణులు చిన్న పిల్లల వైద్యులు అందరూ డిప్యూటేషన్ల పై వెళ్లిపోతే ఇక్కడి ప్రజలకు సేవలు ఎవరు అందిస్తారని ప్రశ్నించారు.
వెంటనే ఈ డిప్యూటేషన్లను రద్దు చేసుకోవాలని లేకపోతే ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తో పాటు అవసరమైతే ముఖ్యమంత్రితో కూడా మాట్లాడుతానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
డిప్యూటేషన్లపై వెళ్ళిన వారు వీరే..!
షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో డిప్యూటేషన్ల పై వెళ్లిన వారి జాబితాలో.. కళ్లకు సంబంధించిన సివిల్ సర్జన్ పద్మలత, చిన్నపిల్లల వైద్యుడు హసీబ్ జహాన్, మరో చిన్న పిల్లల వైద్యుడు ఖాజా కలిమొద్దిన్, గైనకాలజిస్ట్ మాధవి లత, రాధిక ఎంబిబిఎస్, ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ శివ రాహుల్, కాంట్రాక్ట్ ఉద్యోగిని డాక్టర్ సౌమ్యశ్రీ, చర్మ వైద్య నిపుణులు షేకసింగ్ డిప్యూటేషన్ లపై వెళ్లినట్లు ఎమ్మేల్యే గుర్తించారు.
Also Read: GHMC: శిథిల భవనాలను గుర్తించాలి.. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి!