తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Ugadi 2025: ఉగాది పండుగ సందర్భంగా రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు తదితరులు మంత్రివర్గ విస్తరణతో పాటు బిల్లులకు ఆమోదం తెలపాలని కోరారు. పరస్పరం తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలను పంచుకున్న వీరంతా గంటన్నర పాటు చర్చించుకున్నారు.
మంత్రివర్గ విస్తరణపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య సుదీర్ఘ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకున్నది. వారం రోజుల్లోపే నలుగురు మంత్రివర్గంలో చేరనున్నారనే సమాచారాన్ని సీఎం ప్రస్తావించినట్లు తెలిసింది. ఏఐసీసీ నుంచి పేర్లు రాగానే రాజ్‌భవన్ వేదికగా ప్రమాణ స్వీకారం నిర్వహించే ముహూర్తం ఖరారు కానున్నదనే అంశాలను వివరించినట్లు తెలిసింది.
మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి నాలుగు మాత్రమే భర్తీ కానున్నాయని, రెండు పెండింగ్‌లో ఉంటాయని అటు సచివాలయ వర్గాల్లో, ఇటు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నలుగురు పేర్లపై పీసీసీ, ఏఐసీసీ పెద్దలు ఢిల్లీ వేదికగా గత వారమే చర్చించుకోవడంతో మరోదఫా సమావేశం ఉండదని, రాష్ట్ర నేతల అభిప్రాయాలన్నింటినీ హైకమాండ్ తీసుకున్నందున ఇక లాంఛనంగా పేర్లను వెల్లడించడమే తరువాయి అని గాంధీ భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: Ponguleti Srinivasa Reddy: ఇందిరమ్మ రాజ్యంలో.. ప్రతిరోజూ పండగే…!
ఏఐసీసీ నుంచి లాంఛనంగా పేర్లు రాగానే వాటిని రాజ్‌భవన్‌కు పంపి ముహూర్తాన్ని ఫిక్స్ చేయడమే మిగిలిందని, వారం రోజుల వ్యవధిలోనే కొత్తగా నలుగురు మంత్రులు కొలువుదీరడం ఖాయమని సమాచారం. సీఎం వెంట ఇద్దరు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ కూడా ఉండడం పలు సందేహాలకు తావిచ్చినట్లయింది.
బిల్లులకు ఆమోదం తెలపడంపై :
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందిన బిల్లులపై గవర్నర్ జిష్యుదేవ్ వర్మతో ఈ సందర్భంగా చర్చించిన సీఎం రేవంత్‌రెడ్డి వీలైనంత తొందరగా సంతకం చేయాలని కోరినట్లు తెలిసింది. మొత్తం 11 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సెషన్‌లో కొత్తగా పన్నెండు బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం సుదీర్ఘ చర్చల అనంతరం సభ్యులు ఆమోదం తెలిపారు.
ఇందులో విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం, స్థానిక సంస్థల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం, దళిత కులాలు, ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజిస్తూ ఎస్సీ వర్గీకరణ బిల్లు సహా మొత్తం 12 బిల్లులు ఉన్నాయి.
అసెంబ్లీ సమావేశాలు జరిగిన విధానం, ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన, ఒక సభ్యుడిని సస్పెండ్ చేయడం, డీలిమిటేషన్ సహా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు తీర్మానాల ప్రతిపాదనలపై చర్చ అనంతరం ఆమోదం పొందడం, బడ్జెట్‌పై చర్చలు వీటన్నింటినీ గవర్నర్‌కు వివరించారు.
Also Read: Venkaiah Naidu: ఓట్ల కోసం అన్నీ ఫ్రీ..ఫ్రీ.. పార్టీలపై మాజీ ఉపరాష్ట్రపతి ఫైర్!