Festive Trains: దసరా పండుగ పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 10 రోజులక్రితమే పండుగ సీజన్ మొదలైంది. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం, విద్యాభ్యాసం కోసం వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నవారు సొంతూళ్లకు క్యూ కడుతున్నారు. దీపావళి, పలు పర్వదినాల సందర్భంగా నవంబర్ నెల చివరి వరకు పండుగ సీజన్ కొనసాగనున్న నేపథ్యంలో, ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు (Festive Trains) చేసింది. పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తోంది. ఇందులో భాగంగా సుమారు 1,450 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. మరో 500 రైళ్లు కూడా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మార్గాల గుండా ప్రయాణించనున్నాయి. అంతేకాదు, సుమారు 350 అదనపు బోగీలను కూడా దక్షిణమధ్య రైల్వే సిద్ధంగా ఉంచింది. ప్రయాణికుల రద్దీ ఉండే మార్గాల్లో ఈ బోగీలను అధికారులు జత చేస్తారు. ఈ ఏర్పాట్లు నవంబర్ నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయి.
ముఖ్యమైన స్టేషన్లు ఇవే..
ప్రత్యేక రైళ్లు ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, లింగంపల్లి, కాచిగూడ, చర్లపల్లి వంటి స్టేషన్ల నుంచి బయలుదేరుతున్నాయి. విశాఖపట్నం, తిరుపతి, కొల్లాం, దానాపూర్, మైసూరు, బెంగళూరు, కాన్పూర్, హౌరా, భువనేశ్వర్, మదురై, తదితర ప్రముఖ గమ్యస్థానాల మార్గాల్లో ఎక్కువగా ప్రయాణిస్తాయి.
Read Also- Bigg Boss 9 Telugu Promo: తనూజ మూతిపై దాడి.. హోస్‌లో మళ్లీ రచ్చ రచ్చ.. ప్రోమో చూస్తే గూస్ బంప్సే!
రోజుకు 2 లక్షల మంది రద్దీ
పండుగ సీజన్‌లో రైల్వే ఏర్పాట్లపై దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటన చేశారు. సాధారణంగా అయితే రోజుకు సుమారు 1.3 లక్షల మంది సికింద్రాబాద్ స్టేషన్ ద్వారా ప్రయాణిస్తుంటారని, పండుగ రద్దీ కారణంగా రోజుకు 2 లక్షల మంది వరకు ప్రయాణికులు రావచ్చు అని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ రద్దీని నియంత్రించేందుకు వీలుగా స్టేషన్‌లో ప్రయాణికులకు వెయిటింగ్ ఏరియాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్లాట్‌ఫామ్-1, ప్లాట్‌ఫామ్-10కి సంబంధించిన రైళ్లు వచ్చిన తర్వాత మాత్రమే స్టేషన్‌లోకి ప్రవేశ అనుమతి ఇస్తామని వివరించారు. తద్వారా రైల్వే స్టేషన్‌లో గందరగోళాన్ని కొంతవరకు తగ్గించవచ్చని ఏ.శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రోజుకు సుమారు 40 వేల మంది ప్రయాణికుల వరకు (దిగేవారు, రైలు ఎక్కేవారు కలుపుకొని) రద్దీ ఉండే ఇతర ప్రధాన స్టేషన్ల జాబితాలో హైదరాబాద్, గుంతకల్లు, విజయవాడ, గుంటూరు, నాందేడ్, తదితర స్టేషన్లు ఉన్నాయి. ఇలాంటి స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను వేర్వేరుగా ఏర్పాటు చేసి, ఫిజికల్ బ్యారికేడ్ల సహాయంతో రాకపోకలను విభజిస్తామని వివరించారు. తద్వారా ప్యాసింజర్ల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది, టికెట్ తనిఖీ సిబ్బంది ఉపయోగించుకుంటున్నారు. ప్రయాణికులతో క్యూలు కట్టించడం, గందరగోళాన్ని నియంత్రించేందుకు వీరు తోడ్పడుతున్నారు. డివిజనల్ మానిటరింగ్ సెల్స్‌ను యాక్టివేట్ చేయడంతో పాటు సీసీటీవీ పర్యవేక్షణ కూడా చేయనున్నారు.