Sigachi Blast: సిగాచి పరిశ్రమ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి కడసారి చూపూ దక్కని వేదన వర్ణనాతీతంగా మారింది. గల్లంతైన వారిలో పది మంది ఆచూకీ దొరకని పరిస్థితి నెలకొంది. ప్రమాదంలో పూర్తిగా కాలిపోయి మాంసపు ముద్దలుగా మారిన మరో 20 మందికిపైగా మృతదేహాల గుర్తింపులోనూ జాప్యం జరుగుతున్నది. ఘటన జరిగి మూడు రోజులైనా తమవారి జాడ లేక కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆచూకీ చెప్పాలంటూ పరిశ్రమ వద్ద ఆందోళనకు దిగారు. మృతులు, గల్లంతైన వారి విషయంలో ప్రభుత్వం, కంపెనీ ప్రతినిధులు ఒక్కో లెక్క చెబుతుండడం గందరగోళానికి దారితీస్తున్నది.
ప్రత్యేకంగా గాలింపు చేపట్టినా
ప్రమాదంలో ఆచూకీ తెలియకుండా పోయిన వారి కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. హైడ్రా, (Hydra) ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, (NDRF) అగ్నిమాపక బృందాలు శిథిలాల్లో గాలించాయి. అదనపు వాహనాలను, పరికరాలను తెప్పించి సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను టిప్పర్లతో ఖాళీ ప్రదేశాలకు తరలించి, మృతదేహాల అవశేషాల కోసం వెతుకుతున్నట్టు సమాచారం.
Also Read: CM Revanth Reddy: హైదరాబాద్ ఐటీకి మాత్రమే కాదు.. బంగారానికీ హబ్!
ప్రమాదానికి గల కారణపై నిపుణుల బృందం ఆరా
సిగాచి (Sigachi) పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటనపై అధ్యయనం కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ (Dana kishore) ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో భారత రసాయన సాంకేతిక సంస్థ (ఐఐసీటీ)కి చెందిన శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ బి.వెంకటేశ్వరరావు (Venkateswara Rao) చైర్మన్‌గా, సభ్యులుగా ప్రతాపకుమార్, (Prathap Kumar) సూర్యనారాయణ, సంతోష్ గుజే ఉన్నారు. నిపుణుల కమిటీ సిగాచి పరిశ్రమకు వెళ్లి ప్రమాదానికి కారణాలు, భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా? లోపాలు ఏమైనా ఉన్నాయా? యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా అన్న అంశాలను పరిశీలించింది.
నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై సిఫార్సులు చేయాలని సూచించింది. మరోవైపు ఈ దుర్ఘటనపై సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీకి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, సిగాచి పరిశ్రమలో 40 మందికిపైగా మృతి చెందడం, చాలా మంది గాయపడిన నేపథ్యంలో 30కిపైగా అంబులెన్సులను అధికారులు సిద్ధంగా ఉంచారు. మృతదేహాలను, క్షతగాత్రులను ఆ వాహనాల్లో స్వస్థలాలకు తరలిస్తున్నారు.
Also Read: Viral Video: క్యాబ్‌లో మద్యం తాగిన యువతి.. డ్రైవర్ చేసిన పనికి నెట్టింట ప్రశంసలు!
మరణాలపై తికమక
ఉదయం మృతుల సంఖ్య 36కు చేరిందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అదే రోజు సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డ (Kishan Reddy) ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 46 మంది వరకు చనిపోయినట్టు అధికారుల ద్వారా తెలిసిందని చెప్పారు. బుధవారం ఉదయం సిగాచి పరిశ్రమ యాజమాన్యం 40 మంది మృతిచెందారని ప్రకటించింది. రాత్రి సంగారెడ్డి కలెక్టర్ (Sangareddy Collector) విడుదల చేసిన ప్రకటనలో మృతుల సంఖ్య 38 అని ఉంది. మరోవైపు పోస్టుమార్టం గదికి 45కు పైగా మృతదేహాల నమూనాలు వచ్చినట్టు చర్చ జరుగుతున్నది. కాగా, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని, అందులోనూ ఆరుగురు వెంటిలేటర్లపై ఉన్నారని సమాచారం. మరో ఆరుగురి శరీరాలు 70శాతానికి పైగా కాలిపోయాయని, వారిని మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించాలని వారి బంధువులు కోరుతున్నారు.
డీఎన్‌ఏ నివేదికల కోసం ఎదురుచూస్తూ..
కాలిపోయిన మృతదేహాల డీఎన్‌ఏ విశ్లేషణ నివేదికల కోసం వారి కుటుంబ సభ్యులు, ఆప్తులు కన్నీళ్లతో ఎదురుచూస్తున్నారు. డీఎన్‌ఏ శాంపిళ్లు సరిపోలిన వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగిస్తున్నారు. బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున తక్షణ నగదు సాయం అందజేసి, మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్లలేక ఇక్కడే అంత్యక్రియలు చేపడతామన్న వారికి జీహెచ్‌ఎంసీ ఆయా శ్మశాన వాటికల్లో ఏర్పాట్లు చేస్తున్నది. అయితే, డీఎన్‌ఏ విశ్లేషణ నివేదికలు అందడంలో జాప్యంతో మృతుల కుటుంబ సభ్యుల వేదనకు అంతే లేకుండా పోయింది.
కంపెనీ వద్ద మూడంచెల భద్రత
ప్రమాదం జరిగిన సిగాచి కంపెనీకి మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 1,2,3 గెట్‌లుగా విభజించి పోలీసులు ఎవరిని లోపలికి వెళ్లనీయడం లేదు. బాధిత కార్మిక కుటుంబాలకు చిందిన వారు అక్కడికి వచ్చినప్పటికీ కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌కు పరిశ్రమ వద్ద నుంచి పంపిస్తున్నారు. మీడియాను సహితం 2వ గేట్ వద్దకు మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. బాధిత కుటుంబాలు మాత్రం కంపెనీ వద్ద తనవారి కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.
సిగాచి షేర్లు ఢమాల్
సిగాచి ఫార్మా ఇండస్ట్రీస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఆ కంపెనీ షేర్లను తీవ్ర ప్రభావితం చేసింది. ప్రమాదం విషయం బయటకు వచ్చినప్పటి నుంచి ఆ కంపెనీ షేర్లు దారుణంగా పతనం అవుతున్నాయి. 3 రోజుల్లోనే 24 శాతం షేర్ వాల్యూ పతనం అయ్యింది. ఒక్కొక షేర్‌పై దాదాపుగా రూ.14 నష్టం వచ్చింది. సిగాచి ఇండస్ట్రీస్ పబ్లిక్ లిమిటెడ్ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. తమ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిన ప్రమాదంపై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌కి కంపెనీ ప్రతినిధి లేఖ రాశారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారాన్ని అందించడంతోపాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ ప్లాంట్‌లో మూడు నెలలపాటు పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు లేఖలో స్పష్టం.
Also Read: Rayachoti Terrorists: రాయచోటి ఉగ్ర కేసు.. 30 బాంబులతో.. 3 నగరాల్లో పేలుళ్లకు కుట్ర!