Kaleshwaram CBI Probe: కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణను సీబీఐకి ఇవ్వడంలో కుట్ర
అందులో చంద్రబాబు హస్తం ఉంది
బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి (Kaleshwaram CBI Probe) ఇవ్వడంలో పెద్ద కుట్రదాగి ఉందని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించకుండా కేసులు వేసిన చంద్రబాబు కుట్ర.. సీబీఐ విచారణ వెనుక ఉందని ఆరోపించారు. తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డి ఏపీకి దోచిపెడుతున్నారని మండిపడ్డారు. గోదావరి జలాలపై తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసే కుట్ర జరిగిందన్నారు. మోదీ, చంద్రబాబు స్క్రిప్టును రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన తర్వాత రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ విషం చిమ్మారన్నారు.
Read Also- Bunny Vas: టాలీవుడ్‌లో చాలా రూల్స్ ఉన్నాయ్.. కానీ పాటించడమే అసాధ్యం! బన్నీ వాస్ షాకింగ్ కామెంట్స్
సీపీఘోష్ కమిషన్ మొత్తం రూ.6 కోట్లు రికవరీ చేయాలని చెప్పిందని, 20వ నంబర్ పిల్లర్ గురించి అడగవద్దని కమీషన్‌కు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఈఎన్సీలు,చీఫ్ ఇంజనీర్లపై ఏసీబీ కేసులు పెట్టారని, ప్రాజెక్టుకు అనుకూలంగా అధికారులు ఎవరూ మాట్లాడవద్దని రేవంత్ రెడ్డి బెదిరించారని ఆరోపించారు. పీసీ ఘోష్ కమిషన్.. మహాదేవ్ పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు కమిషన్ రిపోర్టు ఇచ్చిందన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, ఆయన డాక్టరేట్‌పై అనుమానం ఉందన్నారు.
Read Also- EU Chief Plane – Russia: ఈయూ చీఫ్ టార్గెట్‌గా ఎయిర్‌పోర్టులో జీపీఎస్‌ను జామ్ చేసిన రష్యా?
హరీష్ బాబు సిర్పూర్‌లో హాస్పిటల్ పెట్టి పేద ప్రజల నుంచి దోచుకుంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మహాదేవ్ పూర్ పీఎస్‌లో వచ్చిన ఫిర్యాదుపై రేవంత్ రెడ్డి సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యూరియాను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్న కాంగ్రెస్, బీజేపీ నేతలపై సిట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌పై, రూ.600 కోట్ల కోడిగుడ్ల స్కామ్‌పై సీబీఐ విచారణ జరగాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోందన్నారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఇంతియాజ్ అహ్మద్ ,దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ,బీ ఆర్ ఎస్ నేతలు ఆజం అలీ ,అభిలాష్ రంగినేని పాల్గొన్నారు.
కేటీఆర్ కూడా అదే ఆరోపణ
కాళేశ్వరంపై సీబీఐ విచారణ సాకుతో తెలంగాణ అస్తిత్వంపై చంద్రబాబు, మోదీలతో కలిసి రేవంత్ రెడ్డి భారీ కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీబీఐ పేరుతో కేసీఆర్, బీఆర్ఎస్ మీదనే దాడి జరగడం లేదన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి మన గోదావరి జలాలను ఆంధ్రకు తరలించే కుతంత్రాలకు ఆ ముగ్గురు తెరతీశారని విమర్శించారు. సోమవారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ గొంతుకగా ఉన్న కేసీఆర్, బీఆర్ఎస్ లను లేకుండా చేసి తెలంగాణపై తిరిగి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మోడీ, చంద్రబాబు ఎజెండా మేరకు బనకచర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు.