AI Partnership: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణతో భాగస్వామ్యమయ్యేందుకు ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి వ్యక్తం చూపింది. హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలపై కూడా చర్చించేందుకు ముందుకొచ్చింది. ప్రపంచ ఆర్థిక వేదిక 2026 వార్షిక సమావేశాల్లో భాగంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం ఫిలిప్స్ గ్లోబల్ నాయకత్వంతో భేటీ అయ్యింది. రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ జాన్ విల్లెమ్ స్కీజ్ గ్రాండ్ మాట్లాడుతూ, ఏఐ రంగంలో తెలంగాణ చేపడుతున్న కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో తెలంగాణ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత సేవలపై ప్రశంసలు కురిపించారు. తమ నెదర్లాండ్స్ ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సందర్శించాలని ఈ సందర్భంగా ఆహ్వానించారు.
లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి
తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘తెలంగాణ నెక్స్ట్–జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030’ గురించి ప్రతినిధి బృందం వివరించింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఔషధ తయారీ, పరిశోధనాభివృద్ధి (ఆర్ అండ్ డీ) రంగాల్లో ప్రపంచ స్థాయి, స్థిరమైన పారిశ్రామిక క్లస్టర్‌ను తెలంగాణలో నిర్మిస్తున్నామని చెప్పారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్యనున్న ప్రాంతంలో పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ తయారీ, లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ఇదే సరైన సమయం
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కొత్త లైఫ్ సైన్సెస్ విధానం, ఔషధ తయారీ వ్యూహాలు కలిసి తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు పునాది వేస్తాయని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే 2,000కు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు, బలమైన ఐటీ, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ టాలెంట్ బేస్, జీనోమ్ వ్యాలీ, 300 ఎకరాలకుపైగా విస్తరించిన మెడికల్ డివైసెస్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఉన్నాయని వివరించారు. వైద్య పర్యాటకానికి హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఇక్కడి ఆస్పత్రులు ఇప్పటికే క్రిటికల్ కేర్, అంబులెన్స్ సేవలు వంటి రంగాల్లో ఏఐను సమర్థవంతంగా వినియోగిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ను ఏఐకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏఐ సిటీని నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. “ఇదే సరైన సమయం. హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడానికి ఇది ఉత్తమ అవకాశం” అని పేర్కొన్నారు. తెలంగాణకు వచ్చి జీనోమ్ వ్యాలీని సందర్శించాలని ఫిలిప్స్ నాయకత్వాన్ని ఆహ్వానించారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఇప్పటికే మెడ్ ట్రానిక్, ఒలంపస్, జీఈ వంటి అగ్రశ్రేణి సంస్థల ఎంబెడెడ్ ఇంజినీరింగ్, ఆర్ అండ్ డీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.
Also Read: Renu Desai: అందుకే తరచూ కాశీకి వెళ్తుంటానంటూ చెప్పుకొచ్చిన రేణు దేశాయ్..

