TG Jobs Calendar: తెలంగాణలో భారీ ఉద్యోగ భర్తీకి రంగం సిద్ధం – రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం తొలి దశలో 30,000 పైగా ఉద్యోగాలు విడుదలకు సిద్దం.
తెలంగాణ యువతకు త్వరలో ఒక్కటొక్కటిగా శుభవార్తలు అందబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావటంతో ప్రభుత్వ నియామక ప్రక్రియకు ముందున్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించి, ఒక్కటొక్కటిగా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.
ఉద్యోగాల జాతర ప్రారంభానికి వేళాయే
ప్రజా ప్రభుత్వంలో మలివిడత ఉద్యోగ నియామకాలకు రంగం సిద్దమౌతోంది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి దశలోనే ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు సమాచారం. పోలీస్, గ్రూప్ వన్, టూ, త్రీ సర్వీసులు, పాఠశాల విద్య, వైద్య ఆరోగ్య, మున్సిపల్, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలలో ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీలు గుర్తిస్తున్నట్లు సచివాలయంలో అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా జాబ్ క్యాలెండర్ ద్వారా నోటిఫికేషన్ల విడుదల
ప్రభుత్వం త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనుంది. దీని ద్వారా నోటిఫికేషన్ల షెడ్యూల్, పరీక్ష తేదీలు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి సమగ్రమైన వివరాలు అందించనున్నది. ఒకేచోట అన్ని వివరాలు పొందుపరిచేలా ఈ క్యాలెండర్‌ను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
యువతలో ఆనందం – ఆశలు నెరవేరనున్న సమయం
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగాన్వేషకుల్లో ఉత్సాహం నెలకొంది. గత కొన్ని నెలలుగా ఎస్సీ వర్గీకరణ, పీఆర్‌సీ, ఎన్నికల కోడ్ వంటివి కారణంగా నియామక ప్రక్రియలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లైన్ క్లియర్ కావడంతో వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
Also read: Damodara Rajanarsimha: ఉద్యోగాలు సాధించే మార్గాలు.. మంత్రి దామోదర సూచనలు
తుది మెరుగులు – త్వరలో నోటిఫికేషన్
ప్రస్తుతం సంబంధిత శాఖలతో కేడర్ స్ట్రెంగ్త్, ఖాళీల వివరాలపై అధికారుల సమీక్ష జరుగుతోంది. కొన్ని రోజుల్లోనే తొలి విడత నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ప్రాథమికంగా గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్, గురుకుల, పాఠశాల విద్యా శాఖలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన ఇంజనీరింగ్ పోస్టులకు కలిపి ఓకేసారి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశముంది.
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం యువత భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని యువతీ యువకులు చక్కగా ఉపయోగించుకోవాలని విద్యా, ఉద్యోగ నిపుణులు సూచిస్తున్నారు.