CM Revanth Politics: ఆదివారం నాడు ఖమ్మం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy Politics) తన మార్క్ వ్యూహాత్మక రాజకీయం చూపించారు. గతంలో తాను పనిచేసిన తెలుగుదేశం పార్టీ (TDP) రాష్ట్రంలో క్రియాశీలకంగా లేకపోయినా, ఆ పార్టీ అభిమానులకు ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. ఏదులాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, తెలంగాణలో బీఎస్‌ఆర్ పార్టీని బొందపెట్టాలంటూ నందమూర్తి తారక రామారావు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి అభిమానులకు పిలుపునిచ్చారు. ‘‘ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావుకి అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్లందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండకూదని కక్ష గట్టి, ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖర్ రావును (KCR), బీఆర్ఎస్‌ను సమూలంగా 100 మీటర్ల గొయ్యి తీసి పాటిపెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్లు గద్దెలు దిగాలి. ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి. అప్పుడు నందమూరి తారక రామారావుకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్లమవుతాం. బీఆర్ఎస్‌ను బొందపెట్టాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది మిత్రులారా’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. బహిరంగ సభలో టీడీపీ జెండాలు కనిపించడం, అలాగే ఇవాళ (జనవరి 18) ఎన్టీఆర్ వర్ధంతి నాడు రేవంత్ చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
పక్కా రాజకీయ వ్యూహం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయం కాస్త విలక్షణం అని చెప్పవచ్చు. స్వతహాగా తెలుగుదేశం పార్టీ నేపథ్యమున్న ఆయన, కాంగ్రెస్‌లోకి వచ్చి చాలా కాలమే అయ్యింది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అయినప్పటికీ, రాజకీయంగా తన ఎదుగుదలకు అవకాశం ఇచ్చిన టీడీపీ పట్ల సమయం దొరికినప్పుడల్లా అభిమానాన్ని వెలిబుచ్చుతూనే ఉన్నారు. తద్వారా తెలుగుదేశం పార్టీ అభిమానులు తనవైపు ఉండేలా వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిజానికి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా లేదు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటోంది. మొత్తంగా రాష్ట్రంలో టీడీపీ సంస్థాగతంగా బలహీనంగా ఉన్నప్పటికీ, ఆ పార్టీ పట్ల సానుభూతి ఉన్న ఓటు బ్యాంకు, ముఖ్యంగా సెటిలర్లు, బీసీ వర్గాలను ఆకట్టుకోవడమే రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ఓటు బ్యాంకు కాంగ్రెస్ విజయానికి దోహదపడిందనే విశ్లేషణలు ఉన్నాయి.
Read Also- Tiger Estimation 2026: రేపటి నుంచే టైగర్ ఎస్టిమేషన్.. వన్యప్రాణుల స్థితిగతులపై సమగ్ర నివేదిక!
ఇప్పుడు రేవంత్ రెడ్డి నేరుగా ఎన్టీఆర్ పేరును, చంద్రబాబు నాయుడి పేర్లను ప్రస్తావించడం ద్వారా, టీడీపీ అభిమానులను శాశ్వతంగా కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, ఖమ్మం పట్టణంలో టీడీపీ సానుభూతిపరులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారడం ఎలాంటి డౌట్ లేదు. తెలంగాణలో టీడీపీని లేకుండా చేసింది కేసీఆరేనన్న భావనను టీడీపీ అభిమానుల్లో మరింత బలంగా నింపాలని రేవంత్ ప్రయత్నిస్తున్నట్టుగా ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతను రేవంత్ పెంచుతున్నారు.
త్వరలోనే పురపోరు.. కలిసొచ్చేనా!
తెలంగాణలో త్వరలోనే మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ ఓటు బ్యాంకును బలంగా ఆకర్షించడం ద్వారా అత్యంత కీలకమైన జీహెచ్ఎంసీ, ఖమ్మంతో పాటు పలు ప్రాంతాల్లో మైలేజీ పొందే అవకాశం ఉంటుంది. అందుకే, సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నారు. మరి, ఈ వ్యూహం ఎంతవరకు కలిసి వస్తుందో వేచిచూడాలి.

