Thummala Nageswara Rao: రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు తీరనున్నాయి. ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాతో సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) భేటీ అయ్యారు. తెలంగాణ రైతులకు సరిపడా యూరియాను ఈ పది రోజుల్లో సరఫరా చేయాలని, వివిధ కారణాలతో దిగుమతి ఆశించిన స్థాయిలో లేదని వివరించారు. రైతుల అవసరాలకు సరిపడా యూరియాను వీలైనంత త్వరగా కేటాయించి, పంపిణీ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: KTR vs Bandi Sanjay: బండి సంజయ్‌కు బిగ్ షాక్.. పరువు నష్టం దావా వేసిన కేటీఆర్.. ఎందుకంటే?
యూరియా సరఫరా నిరంతరంగా కొనసాగేలా చూడాలి
మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో సాగులో ఉన్న వరి, మొక్కజొన్న, పత్తి వంటి ప్రధాన పంటలకు యూరియా అవసరం అని, ఈ పదిహేను రోజులు వ్యవసాయ సీజన్‌లో కీలకమైనవి అన్నారు. ఈ సమయంలో రైతులకు ఎరువులు అందుబాటులో లేకపోతే పంటలు తీవ్రంగా దెబ్బతింటాయని, యూరియా సరఫరా నిరంతరంగా కొనసాగేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. ఆగస్టు నెలల్లో ఏర్పడిన యూరియా లోటును పూడ్చే విధంగా ఈ నెలలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కోరారు.
1,04,000 మెట్రిక్ టన్నుల యూరియా
రానున్న 10 రోజుల్లో మరో లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని కోరగా.. ఈ వారంలో 80 వేల మెట్రిక్ టన్నులను సరఫరా చేస్తామని రజత్ కుమార్ మిశ్రా చెప్పారని అన్నారు. సోమవారం 40 వేల మెట్రిక్ టన్నులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ కేటాయించిన యూరియా త్వరలోనే రాష్ట్రానికి చేరుకుంటుందని, దీంతో తెలంగాణ రైతుల యూరియా కష్టాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ మొదటి 15 రోజులలోనే 1,04,000 మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి సరఫరా చేసినట్లు అవుతుందని మంత్రివివరించారు. మిగతా మొత్తం కూడా పంపించడానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దేశీయ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోయినా, దిగుమతుల ద్వారా తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర కార్యదర్శి హామీ ఇచ్చారని మంత్రి వెల్లడించారు.
Also Read: Jharkhand Encounter: మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ.. అగ్రనేత హతం.. మరో ఇద్దరు కీలక నేతలు సైతం?