Jangaon District: 140 ఎకరాలపై రియల్టర్ల కన్ను
సర్వే నెంబర్ భూమిని పేదలకు పంచుతాం
సర్కారు ముందుకొచ్చి పేదలకు ఇవ్వాలి
జనగామ, స్వేచ్ఛ: జనగామ జిల్లా (Jangaon District) ఎర్రగొల్లపహాడ్ గ్రామంలో సర్వేనెంబర్ లేని సర్కారు సీలింగ్ భూమిలో సీపీఐఎం నేతలు ఎర్రజెండాలు పాతారు. ఈ భూమిపై రియల్టర్ల కన్ను పడిందని, ఈ భూమిని పేదలకు పంచుతున్నామని సీపీఐఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి చెప్పారు. ఆదివారం పలువురు పేద కుటుంబాలను తీసుకెళ్లి ఈ సర్కారు భూమిలో ఎర్రజెండాలను పాతారు. ఎర్రజెండాలు పాతిన అనంతరం కనకారెడ్డి మాట్లాడుతూ, ఎర్రగొల్ల పహాడ్ గ్రామంలో సుమారు 140 ఎకరాలకు సర్వే నెంబర్ లేదన్నారు. దీనిని అలుసుగా తీసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా అమ్మకాలు సాగిస్తున్నారని, వేరే నెంబర్లు వేసి అమ్మకాలు చేస్తూ లక్షలాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు.
Read Also- ISRO CMS-03: 4,410 కేజీల ఉపగ్రహాన్ని మోసుకొని నింగిలోకి దూసుకెళ్లిన బహుబలి రాకెట్
రియల్ వ్యాపారులు పెట్రేగిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, సర్కారు భూమిని కాపాడాలనే ప్రయత్నం చేయడం లేదని కనకారెడ్డి ఆరోపించారు. ఈ భూమిని పేదలకు పంచాలని సీపీఐఎం పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సర్కారు భూమిలో ఎర్రజెండాలు ఆదివారం నాటామని, ఈ భూములను పేదలకు పంచుతామని తెలిపారు. సర్కారు ముందుకొచ్చి సర్వే చేసి హద్దులు నిర్ణయించి ఈ భూములును పరిరక్షించి పేదలకు పంచితే సర్కారుకు ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. కోట్లాది విలువైన ఈ భూములను పేదలకు పంచకుంటే సీపీఐ ఎం పంచి చూపుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎం మండల కార్యదర్శి బోడ నరేందర్, జిల్లా కమిటి మెంబర్ బూడిద గోపీ, పొత్కనూరి ఉపేందర్, గుండెల్లి రాజు, బైరగోని మల్లేష్, ఆజ్మీర సురేష్, శ్రీనివాస్, సిద్దులు పాల్గొన్నారు.
