Telangana govt: 6వేల ఎకరాల భూమి రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. ఈ భూమి అంతా దేవాదాయశాఖకు చెందినది. కానీ ఆ భూమి ఎక్కడుందో ఇప్పటివరకు అధికారులు గుర్తించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18నెలలు గడిచినా ఆ భూమిపై దృష్టిసారించలేదు. ఆ భూమిని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనంకు చర్యలు తీసుకుంటుందా? లేక తాత్సారం చేసి వదిలేస్తుందా? అనేది హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వం చొరవ తీసుకోలేదు. ఈ ప్రభుత్వం సైతం ఇప్పటివరకు చర్యలు చేపట్టకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. భూమి స్వాధీనం చేసుకుంటే దేవాదాయశాఖకు ఆదాయం వస్తుందని, ఆలయాలను అభివృద్ధి చేసుకోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణలోని ఆలయాల పరిధిలో మొత్తం 91,827 ఎకరాలు ఉన్నట్లు దేవాదాయశాఖ రికార్డులు పేర్కొంటున్నాయి. అందులో 25వేల ఎకరాలు కబ్జాకు గురైందని తెలిసింది. మరో 6003.18 ఎకరాలు ఇతర రాష్ట్రాల పరిధిలో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఆ.. 6వేల ఎకరాల భూమి కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల పరిధిలో ఉన్నట్లు రికార్డుల్లో స్పష్టంగా ఉంది. అయితే ఆ భూమి ఎక్కడ ఉందో మాత్రం పూర్తిగా అధికారులే తెలియడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also read: Nagarjuna: నాగార్జున హీరోగా కొత్త సీరియల్.. బుల్లితెర ప్రేక్షకులకు పండగే.. ప్రోమో రిలీజ్
ఆ భూమి అసలు ఉందా? లేదా? ఉంటే గత ప్రభుత్వం ఏమైనా సర్వే చేసినట్లు దాఖలాలు కూడా లేవని ఉద్యోగులు పేర్కొంటున్నారు. అంతేకాదు ఆ భూములకు సరిహద్దులు నిర్ణయించడం గానీ, బోర్డులు ఏర్పాటు చేసినట్లు ఆనవాళ్లే లేవు. ఆ భూమి ఎక్కడ ఉందో గుర్తించడం ప్రస్తుతం అధికారులకు తలనొప్పిగా మారింది. ఆ భూమి ఇతర రాష్ట్రాల్లో ఉందని ఎవరిని సంప్రదించాలి? ఎలా ఆభూముల దగ్గరకు వెళ్లాలి? ఎలా స్వాధీనం చేసుకోవాలో తెలియని పరిస్థితి. ప్రతి రోజూ శాఖ పరిధిలో ఉన్న భూములను కాపాడుకోవడానికే అధికారులకు సరిపోతుందని సమాచారం.
ఇతర రాష్ట్రాల్లో ఉన్న భూ వివరాలు..
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కర్నాటక, ఆంద్రప్రదేశ్, మహారాష్ట్రంతో పాటు రాజస్థాన్ లోనూ భూమి ఉన్నట్లు రికార్డులు పేర్కొంటున్నాయి.
1.నారాయణపేట జిల్లాలోని మగనూరు గ్రామం, నేరేడ్గం మండలంలోని సిద్దిలింగేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూమి 1137 ఎకరాలు ఉంది. ఈ భూమి కర్నాటక రాష్ట్రంలోని ఉన్నట్లు రికార్డులో ఉంది.
2.భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలోని భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి 1052.07 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఏపీలోని క్రిష్ణా, ప్రకాశం, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కర్నూల్ జిల్లాలోని ఉంది.
3.జనగాం జిల్లాలోని లింగాల ఘన్ పూర్ లోని జీడికల్ రామచంద్రస్వామి ఆలయానికి 12.19 ఎకరాలు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కొర్నెపాడు గ్రామం, వట్టిచెరుకు మండలంలో ఉన్నట్లు రికార్డులు పేర్కొంటున్నాయి.
4.వరంగల్ జిల్లాలోని వరంగల్ పట్టణ పరిధిలోని రంగశాయిపేట గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయానికి 8 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఏపీలోని క్రిష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఉంది.
5.ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ పట్టణంలో శ్రీరామచంద్ర గోపాల క్రిష్ణ మఠ్ కు 1280.38 ఎకరాలు ఉంది. ఈ భూమి మహారాష్ట్రలోని యెవాత్మల్ జిల్లాఖేలాపూర్ తలుకు మండలం గోష్మి గ్రామంలో ఉంది.
6.మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ (గద్వాల)లో గల బాల బ్రహ్మేశ్వరస్వామి అన్నదాన సత్రం కు 20.17 ఎకరాలు ఉండగా ఈ భూమి ఏపీలోని కర్నూల్ జిల్లాలోని జి.సింగవరం,కల్లూరులో ఉంది.
7.హైదరాబాద్ పరిధిలోని ఆసిప్ నగర్ లోని మల్లేపల్లిలో ఉన్న సీతారంభాగ్ సీతారామచంద్రస్వామి ఆలయం(సీతారాం మహరాజ్ సంస్థాన్)కు 2492.17 ఎకరాలు ఉంది. ఈ భూమిమహారాష్ట్రలోని అమరావతి, రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ లో ఉన్నట్లు రికార్డులో ఉంది.
మరి గుర్తింపేలా?
దేవాదాయశాఖకు చెందిన భూమి 6వేల 3 ఎకరాల 18 గుంటల భూమి నాలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలోనే దేవాదాయశాఖకు చెందిన ఎక్కువ భూమి ఉన్నట్లు రికార్డులో ఉంది. దాదాపు 3709.55 ఎకరాల(రాజస్థాన్ తో కలిపి) భూమి ఉంది. ఆ తర్వాత కర్నాటకలో 1137 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ లో 1092.43 ఎకరాల భూమి ఉంది. అయితే ఈ భూమికి సరిహద్దులు నిర్ణయించలేదని సమాచారం.
నక్ష, హద్దులు, సూచిక బోర్డులు సైతం ఏర్పాటు చేయలేదని విశ్వసనీయ సమాచారం. అయితే ఈ భూమికి ప్రస్తుతం లక్షల్లో ధర పలుకుతుంది. రికార్డుల్లో ఉన్న భూమిని ఇప్పటివరకు అధికారులు సర్వే చేయలేదని, అసలు ఆదిశగా అడుగులు వేయలేదని తెలిసింది. ఇప్పుడు ఈ భూమిని గుర్తించడం అధికారులతో పాటు ప్రభుత్వానికి సవాల్ గా మారింది. సర్వే నెంబర్లు సైతం స్పష్టం లేవని ప్రచారం జరుగుతుంది. గత ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది తప్పా వాటికి చెందిన భూములపై సర్వే చేయలేదు.
ఆ భూములపై దృష్టిసారించలేదని సమాచారం. కనీసం ఈ భూములపై సమీక్షలు సైతం నిర్వహించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఆలయాలకు వైభవం వచ్చేదని, ఆదాయం సైతం వచ్చేదని పలువురు పేర్కొంటున్నారు.
పక్కా రాష్ట్రాల్లోనూ అనుకూల ప్రభుత్వాలు ఉన్నప్పటికీ..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంపై ఇతర రాష్ట్రాల్లో భూముల స్వాధీనంపై సర్వత్రా చర్చజరుగుతుంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిపై సానుకూల ధోరణి ఉందని ప్రచారం సైతం జరుగుతుంది. ఇప్పుడు ఆలయ భూములపై ఆ రాష్ట్రాలతో చర్చజరిపితే తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
Also read: Telangana MLAs: మినిస్టర్ల పర్యటనల్లో తేలుతున్న సమస్యలు.. మంత్రులపై ఎమ్మెల్యేలు ఒత్తిడి!
ఒక వేల ఆలయ భూములను స్వాధీనం చేసుకోకపోయినా కనీసం వాటికి ధర కేటాయించి ఆయా ప్రభుత్వాలకు అమ్మకం చేసి అందుకు వచ్చిన దానితో రాష్ట్రంలో భూములు కొనుగోలు అయినా లేకుంటే ఆలయాల అభివృద్ధికి అయినా కేటాయిస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.
18 నెలలైన పడని ముందడుగు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తుంది. అయినప్పటికీ ఇతర రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న దేవాదాయశాఖకు చెందిన భూముల స్వాధీనానికి మాత్రం ముందడుగు పడలేదు. ఒకటిరెండుసార్లు మాత్రమే మంత్రి కొండసురేఖ భూములపై చర్చించినట్లు సమాచారం. కానీ ఇతర రాష్ట్రాల భూములపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇంతకు ఆ భూములను స్వాధీనం చేసుకుంటారా? లేకుంటే గత ప్రభుత్వం అనుసరించిన విధంగానే కాలయాపన చేస్తారా? అనేది సర్వత్రా చర్చకు దారితీసింది.
ఇప్పటికే దేవాదాయశాఖకు వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతున్నట్లు సమాచారం. ఈ తరుణంలో ఇతర రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న 6వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటే శాఖ ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు ఆలయాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.