Kokapet Land Prices: నిధుల సమీకరణ కోసం హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న భూముల వేలంలో (Kokapet Land Prices) శుక్రవారం సరికొత్త రికార్డు నమోదయింది. ప్లాట్ నంబర్ 15లో ఒక్క ఎకరం ఏకంగా రూ.151.25 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో, కోకాపేట భూములు సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఈ ప్లాట్‌లో మొత్తం 4.03 ఎకరాలు ఉండగా, జీహెచ్ఆర్ అర్బన్ బ్లాక్స్, లక్ష్మీ ఇన్‌ఫ్రా కంపెనీలు వీటిని దక్కించుకున్నాయి. ఒక్క ఈ ప్లాట్ ద్వారానే హెచ్ఎండీఏకి ఏకంగా రూ.743 కోట్ల ఆదాయం సమకూరింది.
మరోవైపు, ప్లాట్ నంబర్ 16లో ఒక్కో ఎకరం రూ.147.75 కోట్లు పలికింది. ఈ ఫ్లాట్‌ను గోద్రెజ్ ప్రొపర్టీస్ దక్కించుకుంది. ఈ ప్లాట్‌లో మొత్తం 5.03 ఎకరాల భూమి ఉంది. మొత్తంగా ప్లాట్ నంబర్ 15, 16లోని భూముల విక్రయం ద్వారా హెచ్ఎండీఏకి రూ.1352 కోట్ల ఆదాయం సమకూరింది.
రోజుల వ్యవధిలోనే రికార్డులు బ్రేక్
హెచ్ఎండీఏ ఇటీవలే నిర్వహించిన ప్లాట్ నంబర్ 17, 18లలోని భూములు గరిష్ఠంగా ఎకరం రూ.137.25 కోట్లు పలికాయి. కోకాపేటలోని నియోపోలిస్ లేఔట్లలోని ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు, 18లోని 5.31 ఎకరాలకు వేలం నిర్వహించగా ఈ రికార్డు ధరలు పలికాయి. వీటి ద్వారా హెచ్ఎండీఏకి రూ.1,355.33 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అయితే, రోజుల వ్యవధిలోనే ఈ రికార్డు శుక్రవారం నాడు (నవంబర్ 28) బ్రేక్ అయ్యింది. మరో పదమూడు, పద్నాలుగు కోట్ల మేర ఎక్కువ ధర పలికాయి.
Read Also- GHMC: డైలమాలో స్ట్రీట్ లైట్ల నిర్వహణ.. నెలలు గడుస్తున్నా మోక్షం ఏదీ?
ఫేజ్ -1, 2 ఎలా జరిగిందంటే?
కోకోపేట నియో పోలీస్ పరిధిలోని ప్రభుత్వ భూములకు హెచ్ఎండీఏ గతంలో రెండుసార్లు వేలం నిర్వహించింది. 2021 జూన్‌లో ఫేజ్-1 వేలం వేసి, మెుత్తం 49 ఎకరాలను విక్రయించింది. వీటి ద్వారా రూ.2000 కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు, ఫేజ్–2 వేలాన్ని 2023 ఆగస్టులో నిర్వహించారు. అప్పుడు 46 ఎకరాలను వేలం వేయగా, హెచ్ఎండీఏకు రూ.3,300 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా ఈ రెండు ఫేజ్‌లలో కలిపి 95 ఎకరాలను వేలం నిర్వహించారు. ఫేజ్ – 3తో కలిపి మొత్తం 120 ఎకరాల భూమిని విక్రయించినట్టు అవుతుంది.
డెవలపర్ల ఆసక్తికి కారణాలు
కోకాపేట నియోపోలిస్‌లో ఒక ఎకరాను వందల కోట్లు రూపాయలు పెట్టి డెవలపర్లు కొనుగోలు చేయడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఇదే కావడం ఒక ముఖ్య కారణంగా ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు అత్యంత సమీపంలో ఉండటం, భూమి ధరలు నిరంతరం పెరుగుతుండటం, హై-రైజ్ కమర్షియల్ ప్రాజెక్టులు, మిక్స్‌డ్ యూజ్ డెవలప్మెంట్‌కు అనుకూలమైన ప్రాంతం కావడంతో ఇక్కడి ల్యాండ్ కొనుగోలు చేసేందుకు డెవలపర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ వేలంలోనూ రికార్డు ధరలు నమోదవుతు వస్తున్నాయి.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రధానంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడం కోసం భూములను వేలం వేస్తోంది. ఈ వేలం ద్వారా వచ్చే నిధులను నగరాభివృద్ధికి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఉపయోగిస్తున్నారు. భూముల విక్రయంలో పారదర్శకత కోసం బహిరంగంగా ఆన్‌లైన్ ఈ-వేలం (e-auction) ప్రక్రియను చేపడుతున్నారు.

