Expired Food: జోగులాంబ గద్వాల జిల్లాలో ఎక్కడ చూసినా కల్తీ ఆహారం, కాలం చెల్లిన వస్తువుల విక్రయాలు రోజుకు పెరిగిపోతున్నాయి. కల్తీ వస్తువులపై ఫుడ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలు చేపట్టకపోవడంతో వ్యాపారస్తులకు, హోటల్(Hotel) నిర్వాహకులకు నాణ్యతలేని పదార్థాలతో వినియోగదారులను మోసం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. జిల్లా కేంద్రంలో పెరుగుతున్న జనాభా కనుగుణంగా అనేక హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మెస్ లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్, రోజురోజుకీ కొత్తగా వెలుస్తున్నాయి. వాటిలో కాలం చెల్లిన వస్తువులతో ఆహార పదార్థాలను నాణ్యత ప్రమాణాలు పాటించకుండా విచ్చలవిడిగా విక్రయాలు చేపడుతూ ధనార్జనే ధ్యేయంగా పలువురు వ్యాపారస్తులు దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా కల్తీ వస్తువుల విక్రయం రోజు రోజుకి పెరుగుతోంది. ప్రజల ఆరోగ్య ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాలపై నిరంతర తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో వారి దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కల్తీ నూనెతోపాటు కల్తీ ఆహార పదార్థాలను వండి ప్రజలకు నాణ్యతలేని ఆహార పదార్థాలను అందిస్తుండడంతో ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
జాడ లేని ఫుడ్ సేఫ్టీ అధికారులు
జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు లేకపోవడంతో అక్రమ దందా చేసేవారి పంట పన్నుతోంది. కాలం చెల్లినటువంటి వస్తువులను, కూల్ డ్రింక్స్(Cool Drinks) ఆహార పదార్థాలను కూడా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉమ్మడి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్లు దాడులు చేపట్టి నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహార పదార్థాలను, వస్తువులను విక్రయించేలా దాడులు చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: Tollywood: ప్రచారంలో అలా మాట్లాడటం ఎందుకు? ఆ తర్వాత ఫూల్స్ అవడమెందుకు?
కాలం చెల్లిన మాంసం విక్రయాలు
జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లాలో ఏ హోటల్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చూసిన ఇతర ఆహార విక్రయ కేంద్రాలలో కాలం చెల్లిన మాంసం, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్ లో ఉన్న మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలను తిరిగి ప్రజలకు ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తూ విక్రయిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. అయినప్పటికీ అధికారులు మాత్రం దుకాణాల వైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల విమర్శలకు తావిస్తున్నాయి. ఇంత జరుగుతున్న అధికారులు ఎందుకు తనిఖీలు చేపట్టడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దాడులు చేపట్టి ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని వస్తువులను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
ఇటీవల చోటు చేసుకున్న పలు సంఘటనలు
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజల అభిరుచులకు అనుగుణంగా అనేక హోటళ్ళు,తినుబండారాలు యథేచ్చగా వెలుస్తున్నాయి. దీంతో వాటి నాణ్యత ప్రమాణాల విషయంలో పర్యవేక్షణ లేకపోవడంతో అక్కడక్కడ కల్తీ ఆహారం, నాణ్యతలేని వస్తువులు వాడకంతో పాటు పరిశుభ్రత పాటించకుండా ఆహార పదార్థాలను వినియోగదారులకు అందిస్తున్నారు.ఈ క్రమంలో ఇటీవల జిల్లా కేంద్రంలోని భాగ్యలక్ష్మి మెస్ లో మధ్యాహ్న భోజనం చేస్తున్న వ్యక్తికి భోజనంలో చనిపోయిన ఈగ కనిపించగా సదరు మెస్ నిర్వహకుడికి విషయం చెప్పగా మామూలేనని పక్కకి తీసి పెట్టాలని లేదా మరో భోజనం పెడతానని తెలుపుతూ ఇంతమందిలో నువ్వు ఒక్కడివి న్యూసెన్స్ చేయవద్దు అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన సంఘటన చోటుచేసుకుంది. అంతేకాకుండా ఐదు నెలల క్రితం అహ్మద్ టిఫిన్ సెంటర్లో సైతం ఒక వ్యక్తి టిఫిన్ చేస్తుండగా చట్నీలో చనిపోయిన బల్లి ప్రత్యక్షం కావడంతో పోలీసులు తనిఖీ చేపట్టి కొద్దిరోజులు ఆ టిఫిన్ సెంటర్ ను బంద్ చేయించారు. జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టులను తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు జిల్లాపై దృష్టి సారించి ప్రజల ఆరోగ్యరీత్యా నిరంతర తనిఖీలు, పర్యవేక్షణ ఉండాలని కోరుతున్నారు.
Also Read; Heroes rejected hits: ఆ సినిమాలను వారు రిజక్ట్ చేయకుంటే స్టార్లు అయిపోయేవారు.. ఎవరంటే?
