CS Ramakrishna Rao: శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఐదు రోజులపాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు.
సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి
కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీసు శాఖ తగు భద్రతా, ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని, అగ్నిమాపక శాఖ ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలని, వైద్య, ఆరోగ్యశాఖ వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రోడ్డు భవనాల శాఖ అవసరమైన బారికేడింగ్‌లు చేయాలని, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
Also Read: CS Ramakrishna Rao: దిగజారుడు చర్యలు తగ్గించుకోండి.. ఉద్యోగులకు సీఎస్ హెచ్చరిక!
ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు
రాష్ట్రపతి నిలయంలో 24 గంటలు స్నేక్ క్యాచర్ బృందాన్ని అందుబాటులో ఉంచాలని సీఎస్ ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ సమన్వయంతో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలు, అదేవిధంగా తేనెటీగలను పట్టుకోవానికి ముందుస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను రామకృష్ణారావు ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సి.వీ ఆనంద్, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
Also Read: QR Code Graves: అక్కడి సమాధులపై QR కోడ్లు.. స్కాన్ చేస్తే ఏం కనిపిస్తుందో తెలుసా?

