TG Power Sector: విద్యుత్ శాఖ బదిలీలపై నిరసనల సెగ..!
TG Power Sector (imagecredit:twitter)
Telangana News

TG Power Sector: విద్యుత్ శాఖ బదిలీలపై నిరసనల సెగ.. దీని వెనుక మర్మమేంటి..?

TG Power Sector: విద్యుత్ శాఖలో అవినీతికి చెక్ పెట్టేందుకు యాజమాన్యం చేపట్టిన బదిలీల ప్రక్రియ ఇప్పుడు ఆ శాఖలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా కీలక పోస్టుల్లో తిష్టవేసిన కొందరు అధికారులు, ఈ బదిలీలను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఆయా పోస్టుల కోసం భారీగా ముడుపులు చెల్లించారని, ఇప్పుడు బదిలీ అయితే ఆ పెట్టుబడి వృథా అవుతుందనే ఆందోళనతోనే వారు వ్యతిరేకిస్తున్నట్లు ఉద్యోగ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకే చోట ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారిని మార్చడం ద్వారా వ్యవస్థలో జవాబుదారీతనం వస్తుందని యాజమాన్యం భావిస్తోంది.

నష్టపోతామనే భయంతో అడ్డంకులు

ప్రస్తుతం కీలక స్థానాల్లో ఉన్న పలువురు అధికారులు గతంలో ఆ పోస్టులను దక్కించుకోవడానికి పెద్ద మొత్తంలో వెచ్చించారని సమాచారం. గతంలో ప్రతి మూడేళ్లకు బదిలీలు చేపట్టాలనే నిబంధన ఉండేది, కానీ ఈసారి సంస్థ రెండేళ్లకే బదిలీలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఒక ఏడాది ముందుగానే బదిలీలు చేస్తే తాము పెట్టిన ‘పెట్టుబడి’ తిరిగి రాబట్టుకోలేమని భావించి, పలువురు అధికారులు ఈ ప్రక్రియను అడ్డుకుంటున్నట్లు ఇతర ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

బదిలీలకు బ్రేక్ వేసే కుట్ర?

విద్యుత్ సంస్థల్లో అవినీతి వేళ్లూనుకుపోయిందనే ఆరోపణల నేపథ్యంలో, ఒకే చోట రెండేళ్లకు పైబడి పనిచేస్తున్న వారిని తప్పనిసరిగా మార్చాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే, పైరవీలతో పోస్టులు పొందిన వారు మాత్రం పైస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. ఈ బదిలీలను వ్యతిరేకిస్తున్న వారిలో గతంలో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన ఓ సంఘం నాయకుడు కూడా కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. గైడ్‌లైన్స్‌ను మార్చాలని వారు పట్టుబడుతుండటం సంస్థ ప్రతిష్టకు తలనొప్పిగా మారింది.

Also Read: Sasirekha Video Song: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి ‘ఓ శశిరేఖా’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. చూసేయండి మరి

సాకుల పర్వం..

బదిలీలను వాయిదా వేయించేందుకు ఉద్యోగులు రకరకాల సాకులను తెరపైకి తెస్తున్నారు. పిల్లల పరీక్షలు, వేసవి విద్యుత్ డిమాండ్, సమ్మర్ యాక్షన్ ప్లాన్ వంటి అంశాలను కారణాలుగా చూపుతున్నారు. సాధారణంగా మే, జూన్ నెలల్లో బదిలీలు జరుగుతాయని, ఇప్పుడు ఉన్నపళంగా జనవరిలో ఎందుకు చేస్తున్నారని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆర్టీజన్లను వదిలేసి కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే బదిలీలు వర్తింపజేయడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా, ఈ నెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని యాజమాన్యం భావిస్తోంది. ఈ అడ్డంకులను అధిగమించి సంస్థ ప్రక్షాళన పూర్తి చేస్తుందా? లేక ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

బదిలీలపై ఏకపక్ష నిర్ణయాలు వద్దు

విద్యుత్ సంస్థల పరిధిలో బదిలీలకు సంబంధించి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీపీఈజేఏసీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉద్యోగ సంఘాలు, యూనియన్లతో చర్చించిన అనంతరమే బదిలీ మార్గదర్శకాలను ఖరారు చేయాలని కోరుతూ శుక్రవారం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. విద్యుత్ ఉద్యోగుల పిల్లలకు వార్షిక పరీక్షలు ఉండటం, వేసవిలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలులో ఉన్నందున మే, జూన్ నెలల్లోనే బదిలీలు చేపట్టాలని జేఏసీ సూచించింది. చర్చలు లేకుండానే జనవరిలో బదిలీలు చేపట్టడంపై నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్ల సేవ నిబంధన సమంజసం కాదని, ప్రస్తుత పోస్టులో కనీసం మూడేళ్లు పూర్తి చేసిన వారికే బదిలీలు వర్తింపజేయాలని కోరారు. అలాగే ఆర్టీజన్లకు ఇన్‌ఛార్జ్ ప్రమోషన్లు, గ్రేడ్ అప్‌గ్రేడేషన్ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల ఉద్యోగుల్లో అభద్రతా భావం నెలకొంటుందని, ఇది విద్యుత్ సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందని జేఏసీ పేర్కొంది. 24వ తేదీ సాయంత్రంలోగా యాజమాన్యాలు చర్చలకు పిలవాలని, లేనిపక్షంలో ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.

Also Read: KGBV Bunker Beds: బంకర్ బెడ్స్ టెండర్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ..!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?