Ponguleti srinivas reddy: భూ భారతి చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న మద్దూర్, లింగంపేట, వెంకటాపూర్, నెలకొండపల్లి నాలుగు మండలాల్లో వచ్చిన దరఖాస్తులను క్షుణంగా పరిశీలించి త్వరితగతిన భూ సమస్యలను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన భూరతిపై ములుగు, కామారెడ్డి, ఖమ్మం, నారాయణపేట జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఏ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రెవెన్యూకార్యాలయంలోనే వాళ్ళ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.
ప్రజల వద్దకే అధికారులు వచ్చి పైసా ఖర్చు లేకుండా వారి భూ సమస్యలను పరిష్కారం చూపిస్తారన్నారు. ఇక రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను తిరస్కరించాల్సి వస్తే లోతుగా, క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాలని సూచించారు. నాలుగు జిల్లాల పరిధిలో వచ్చిన దరఖాస్తులు, ప్రధాన సమస్యలపై చర్చించి నెలాఖరు కల్లా ఒక పరిష్కారానికి రావాలన్నారు.
Also Read: Jagga Reddy: ఈటల రాజేందర్ పై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్!
దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి అవసరమైన నైపుణ్యవంతులైన సిబ్బందిని పంపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలోకూడా ఎప్పటికప్పుడు అర్హుల జాబితాలను ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులకు పంపించి ఆమోదం తీసుకోవాలన్నారు. అంతేగాక వీలైనంత త్వరగా ఇండ్ల నిర్మాణం ప్రారంభించేలా చూడాలన్నారు.ఈ సమావేశంలో సీసీఎల్ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ మకరంద్ కూడా పాల్గొన్నారు.
అమల్లోకి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్:
ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలన్న లక్ష్యంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రజలకు మరింత చేరువచేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని కోరారు. రెండవ దశలో భాగంగా రాష్ట్రం లో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం ప్రారంభమైంది.
మొదటి దశలోని 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో, రెండో దశలో 25 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం అమలులోకి వచ్చిందని, వచ్చేనెలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తామన్నారు.
రిజిస్ట్రేషన్‌కు వచ్చి గంటల తరబడి చెట్ల కింద నిరీక్షించి క్యూ లైన్లలో నిల్చోనే పరిస్దితికి అడ్డుకట్ట వేసేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకు, పారదర్శకతను తీసుకురావడానికి ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.త్వరలో క్యూలైన్లకు గుడ్‌బై చెప్పే రోజులు వస్తాయని దళారులు ప్రమేయం కూడా ఉండబోదన్నారు.
Also Read: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలకు తగిన ఏర్పాట్లు లేవు.. అధికారులపై పుట్ట మధు ఫైర్!