Indiramma Houses: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలైన జర్నలిస్టులకు అలాగే వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. ఇదిలాఉండగా వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలసరి పెన్షన్, తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలకు గురై వృత్తి నిర్వహించలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు నాంపల్లిలోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండల, నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మంచిని మంచిగా, నిజాన్ని నిర్భయంగా సమాజనికి తెలియజేసే దాంట్లో ఎంతో మంది జర్నలిస్టులు ఆణిముత్యాలుగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. జర్నలిస్టు వృత్తిని నమ్ముకుని తన జీవితం మొత్తం ఆ వృత్తికే అంకితం అయినవాళ్లు ఎంతోమంది ఉన్నారన్నారు. ఆనాటి ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ప్రెస్ అకాడమీ భవనాన్ని చిన్న చిన్న మరమ్మతులు పూర్తిచేసి ఈనెల చివరిలోగా ప్రారంభిస్తామని తెలిపారు.
Also Read: KTR on CM Revanth: ఖమ్మం పర్యటనలో సీఎం రేవంత్ పై.. కేటీఆర్ సంచలన కామెంట్స్!
ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి మంజూరు చేసిన రూ.42 కోట్లను ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని విడతల వారీగా జర్నలిస్టుల సంక్షేమం కోసం అకాడమీ ఖర్చు పెడుతోందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఫిక్స్ డ్ డిపాజిట్ పై వచ్చిన వడ్డీ ఆధారంగా ఇప్పటివరకు రూ.22 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన 597 మందికి రూ.1,00,000తో పాటు ఐదేండ్ల వరకు నెలకు రూ.3000 చొప్పున పెన్షన్, వారి పిల్లలకు ట్యూషన్ ఫీజుల కింద 1 నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలకు నెలకు రూ.1,000 చొప్పున గరిష్టంగా ఇద్దరికి అందిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సమాజంలో జర్నలిస్టు వృత్తి అత్యంత కీలకమైనదని, తమ ప్రాణాలను లెక్క చేయకుండా సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. రెండ్రోజులుగా పాక్-భారత్ మధ్య ఏం జరుగుతుందో అన్న ఆతృతతో ఎదురుచూస్తున్న ప్రజలకు తమ ప్రాణాలను లెక్క చేయకుండా సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని కొనియాడారు. అనంతరం ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, జర్నలిస్టుల సంక్షేమానికి నిధులను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు