Phone Tapping Case: రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రధాన నిందితునిగా ఉన్న ప్రభాకర్ రావును స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆయన పాస్ పోర్టును రద్దు చేయించిన అధికారులు సీబీఐ ద్వారా రెడ్ కార్నర్ నోటీసును కూడా జారీ చేయించారు. కాగా, అరెస్టు నుంచి తప్పించుకోవటానికి ప్రభాకర్ రావు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని త్వరలోనే సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. కాగా, తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ ఇప్పటికే ఆయన అమెరికన్ ప్రభుత్వానికి లిఖిత పూర్వక విజ్ఞప్తి చేసినట్టుగా సమాచారం.
విమర్శలు వస్తుండటంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంట్లో ప్రధాన నిందితునిగా ఉన్న ప్రభాకర్ రావు కేసులు నమోదు కాగానే అమెరికా పారిపోయారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సిట్ విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు.
పద్దెనిమిది నెలలు గడిచిపోతున్నా ప్రభాకర్ రావును వెనక్కి రప్పించ లేకపోతున్న దర్యాప్తు అధికారుల తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాకర్ రావును ప్రశ్నించినపుడే ఫోన్ ట్యాపింగ్ వెనక ఉన్న అసలు సూత్రధారుల పేర్లు బయటకు వస్తాయని పోలీసు వర్గాలు సైతం అంటున్నాయి. దర్యాప్తు అధికారుల వ్యవహార శైలిపై ప్రభుత్వం కూడా ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్..సెక్రటేరియట్ లో సమావేశానికి రైతులకు పిలుపు!
ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాకర్ రావును వెనక్కి రప్పించాలని నిర్ణయం తీసుకున్న సిట్ ఈ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్ పోర్టును రద్దు చేయించింది. అదే సమయంలో సీబీఐ ద్వారా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేయించింది. ప్రభాకర్ రావుపై నమోదైన కేసు వివరాలతో ఉన్న ఈ రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పటికే ఇంటర్ పోల్ కు చేరినట్టుగా సమాచారం. భారత విదేశీ మంత్రిత్వ శాఖతో మాట్లాడటం ద్వారా ఈ రెడ్ కార్నర్ నోటీస్ వెంటనే అమలయ్యేలా చూసేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇవి సఫలమైతే అమెరికా ప్రభుత్వం ప్రభాకర్ రావును డిపోట్ చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
కాగా, అరెస్ట్ నుంచి తప్పించుకునుందుకు ప్రభాకర్ రావు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగా ఆరోగ్య సమస్యలతో ఉన్న తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో కొంతకాలం క్రితం పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే విచారణకు సహకరిస్తానని న్యాయస్థానానికి తెలిపారు. అయితే, హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేసింది. దాంతో త్వరలోనే సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఇదే కేసులో నిందితునిగా ఉన్న శ్రవణ్ రావుకు సుప్రీం కోర్టు నాట్ టు అరెస్ట్ రక్షణ కల్పించిన నేపథ్యంలో తనకు కూడా ఆ వెసులుబాటు ఇవ్వాలని ఆయన కోరనున్నట్టు తెలిసింది.
Also Read: Maoist Party: మేము శాంతి చర్చలకు సిద్ధం…కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనా? స్పష్టం చేయాలి!
దాంతోపాటు వీలైనంత కాలం తన అరెస్టును వాయిదా వేసేందుకుగాను ప్రభాకర్ రావు మరో ఎత్తుగడ కూడా వేసినట్టుగా సమాచారం. ఇందులో భాగంగా తనను రాజకీయ శరణార్థిగా పరిగణించాలని ఆయన అమెరికన్ ప్రభుత్వానికి లిఖిత పూర్వక విజ్ఞప్తి చేసినట్టుగా తెలియవచ్చింది. తాను తెలంగాణ పోలీసు శాఖలో వేర్వేరు హోదాల్లో పని చేసినట్టుగా అందులో తెలిపినట్టు సమాచారం. రాజకీయ కారణాలతోనే తనను ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితునిగా చేర్చారని పేర్కొన్నారని తెలియవచ్చింది. అయితే, దీనిపై అమెరికన్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదని తెలిసింది. దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్న ఓ అధికారితో మాట్లాడగా సుప్రీం కోర్టు రక్షణ కల్పిస్తే తప్ప ప్రభాకర్ రావు అరెస్ట్ ఆగదన్నారు. ఈ నెలాఖరులోపు అతన్ని స్వదేశానికి రప్పిస్తామని చెప్పారు. చూడాలి ఏం జరుగుతుందో…?.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు