Teenmaar Mallanna: ఈశ్వర చారి ఉదంతంలో నిజానిజాలు తేల్చాల్సిందే అంటూ పిటిషన్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఎమ్మెల్సీ చింతపండు నవీన్, అలియాస్ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) ఆఫీస్ ముందు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర చారి విషాదాంతంలో నిజానిజాలను వెలికి తీయాలంటూ పలు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. ఈశ్వర చారి మృతిలో పలు అనుమానాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. దీనిపై కథనాలు ప్రసారం చేసినందుకు తీన్మార్ మల్లన్న వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయిస్తూ, యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై కేసులు పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి, ఈశ్వర చారి ఆత్మహత్య వెనక అసలు కారణాలు ఏమున్నాయి? అన్నది వెలుగు చూసేలా విచారణకు ఆదేశాలు ఇవ్వాలంటూ శుక్రవారం మానవ హక్కుల కమిషన్‌కు పిటిషన్ సమర్పించారు. దీనిని కమిషన్ విచారణకు స్వీకరించింది. తీన్మార్ మల్లన్న కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకున్న ఈశ్వర చారి ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
Read Also- Dr Nori Dattatreyudu: గ్లోబల్ సమ్మిట్ విజయవంతం పై.. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు కీలక వ్యాఖ్యలు
బీసీల హక్కుల కోసమే ఈశ్వర చారి ప్రాణాలు తీసుకున్నాడంటూ తీన్మార్ మల్లన్నతోపాటు బీఆర్ఎస్ తదితర పార్టీల నాయకులు ప్రచారం చేశారు. దాంతో ఈ విషాదం మరింత సంచలనంగా మారింది. కాగా, ఈశ్వర చారి ఆత్మహత్య చేసుకోవటానికి ఇతరత్రా కారణాలు ఉన్నాయన్న వార్తలు వచ్చాయి. వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్ అయిన ఈశ్వర చారి ఆరోగ్య సమస్యలతో 2 నెలలుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి అద్దె కూడా చెల్లించ లేకపోయాడు. ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో ఇటు ఈశ్వర చారి వైపు ఉన్నవారు… అటు అతడి భార్య వైపు బంధువులు ఎలాంటి సాయం చేయలేదు. దాంతో పిల్లలకు కడుపు నిండా భోజనం కూడా పెట్టలేని స్థితికి చేరుకున్నాడు. ఈ క్రమంలో సాయం కోసం ఈశ్వర చారి భార్య తీన్మార్ మల్లన్న వద్దకు వచ్చింది. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న ఆమెకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందించాడు. అయితే, సాయం చేయటానికి ముందు ఆమెతో మాట్లాడిన సంభాషణలను, డబ్బు ఇవ్వటాన్ని వీడియో రికార్డింగ్ చేయించి తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశాడు. వీటిని చూసిన ఈశ్వర చారి బంధుమిత్రులు అవహేళన చేయటంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీనిపైనే వేర్వేరు యూ ట్యూబ్ ఛానళ్లు కథనాలు ప్రసారం చేశాయి. ఈశ్వర చారి ఆత్మహత్య వెనుక పలు అనుమానాలు ఉన్నాయని, నిష్పాక్షిక దర్యాప్తు జరిపి వాటిని వెలికి తీయాలని కథనాల్లో పేర్కొన్నాయి.
కేసులు పెడుతున్నాడు..
కాగా, ఈ కథనాలు ప్రసారం చేసినందుకు తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదులు ఇస్తూ తమపై కేసులు నమోదు చేయిస్తున్నాడని పేర్కొంటూ పలు యూ ట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు శుక్రవారం మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేశారు. నలుగురిలో తన పరువు పోయిందన్న మానసిక వేదనతోనే అతను ప్రాణాలు తీసుకున్నట్టుగా అనుమానాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఈశ్వర చారి భార్య ఆడియో క్లిప్పింగ్ రూపంలో సోషల్ మీడియా ద్వారా బహిర్గత పరిచినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈశ్వర చారి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రేరేపించబడ్డాడా? అన్న కోణంలో విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఈశ్వర చారి ఒంటిపై పెట్రోల్ చల్లుకుని తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు నిప్పంటించుకోగా మంటలు ఆర్పటానికి ప్రయత్నించాల్సింది.. పోయి బీసీల కోసమే ప్రాణం తీసుకుంటున్నావా? అని ఆయన వద్ద పని చేస్తున్న సిబ్బంది ప్రశ్నించారని పేర్కొన్నారు.
దీంతోపాటు జరిగిన విషాదంలో పలు అనుమానాలు ఉన్నందున సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈశ్వర చారి మొబైల్ ఫోన్ కాల్ డేటాను కూడా బయటకు తీయించాలని పేర్కొన్నారు. ఈశ్వర చారి ఆత్మహత్య చేసుకున్నపుడు అక్కడ ఉన్న వారి స్టేట్ మెంట్లు రికార్డు చేయాలన్నారు. మంటలు ఆర్పటానికి ఎందుకు ప్రయత్నించ లేదన్నది నిగ్గు తేల్చాలని పేర్కొన్నారు. ఓవైపు మనిషి మంటల్లో కాలిపోతుంటే బీసీల కోసమే ఆత్మహత్య చేసుకుంటున్నావా? అని అడగటం ఏంటని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకోవటానికి ముందు ఈశ్వర చారి ఎన్నిసార్లు తీన్మార్ మల్లన్న ఆఫీస్‌కు వచ్చాడు? ఎవరెవరికి ఫోన్లు చేశాడు? చివరగా ఎవరితో మాట్లాడాడు? అన్న వివరాలను కూడా వెలుగులోకి తీసుకు రావాల్సి ఉందన్నారు. ముందుకొచ్చిన ఈ ప్రశ్నలనే ప్రస్తావిస్తూ వార్త కథనాలు ప్రసారం చేస్తే తీన్మార్ మల్లన్న తమపై పోలీసు కేసులు పెట్టిస్తున్నాడన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించటమే అని తెలిపారు. పోలీస్ కేసులు పెట్టించటం ద్వారా జర్నలిస్టులను భయపెట్టాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని తెలియచేశారు. ఈ నేపథ్యంలో నిజానిజాలను బయటకు తీయటానికి సమగ్ర విచారణ జరిపించాలని అభ్యర్థించారు.

