Ponguleti Srinivasa Reddy: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సమ్మక్క-సారలమ్మ జాతర జనవరిలో ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతరకు శాశ్వత ప్రాతిపదికన విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ( సీతక్క), ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజుతో కలిసి ఎస్ఎస్ తాడ్వాయి మండలం సమ్మక్క సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలను, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్ పనులను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను, జంపన్న వాగు వద్ద పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత మంత్రి సీతక్కతో కలిసి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఆయన పూజలు చేశారు.
పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలి
అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. మరో వందేళ్ల వరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసే విధంగా నిర్మాణాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మేడారం దేవాలయం అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ జాతరకు గిరిజనులు, గిరిజనేతరులు దాదాపు కోటి మందికి పైగా హాజరవుతారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మేడారం ప్రాంగణాన్ని మహా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
జాతర కోసం 50 కిలోమీటర్ల పరిధిలో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, పూజారులు, ఆర్ అండ్ బీ, ఇంజినీరింగ్ అధికారులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Ponguleti Srinivasa Reddy: ఇరుకు స్థలాల సమస్యకు పరిష్కారం.. పట్టణ పేదలకు పొంగులేటి తీపికబురు

