Chief Engineer Harassment: పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే ఓ అధికారి వేధిస్తున్నాడని క్వాలిటీ కంట్రోల్ (క్యూసీ) విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులు మంత్రి సీతక్కకు ((Seethakka) ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతూ, వేధింపులకు గురి చేస్తున్నాడని, వీడియో కాల్స్ చేస్తూ సందేహాలు తీర్చాలని మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అతను మహిళా ఎస్‌క్యూసీవోలు ఉన్న జిల్లాలో పర్యటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటాడని పేర్కొన్నారు.
Also Read: Bonalu Festival 2025: నేటి నుంచి బోనాలు ప్రారంభం.. పకడ్బందీగా నిధుల కేటాయింపు!
ఆయన అస్పష్టమైన నిర్ణయాలతో కార్యాలయ సిబ్బంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. వేధింపులు భరించలేక ఇద్దరు మహిళా జేక్యూసీవోలు ఉద్యోగానికి రాజీనామా చేశారని, వేధింపులు భరించలేక పలువురు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లారని పేర్కొన్నారు. వేధింపులపై వివరంగా లేఖ రాసి మంత్రి సీతక్క ((Seethakka) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, డైరెక్టర్ సృజనకు పంపించారు. ఈ లేఖ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యింది. ఈ విషయంపై పలుమార్లు ఆయనను ఉన్నతాధికారులు హెచ్చరించినా తీరులో మార్పు లేదని మహిళా ఉద్యోగులు వాపోతున్నారు. సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మంత్రి సీతక్క సీరియస్.. చర్యలకు ఆదేశం
మహిళా ఉద్యోగులు చేసిన ఫిర్యాదును మంత్రి సీతక్క ((Seethakka) సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే శాఖ పరమైన విచారణకు ఆదేశించారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలన్నారు. మంత్రి ఆదేశాలతో డైరెక్టర్ సృజన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ కమిటీ విచారణ ప్రారంభించింది.