Bandi Sanjay: జూబ్లీహిల్స్ అంటే బంగ్లాలే అనుకున్నాడు
బస్తీలను పట్టించుకుంటున్నట్లు నటిస్తున్నాడు
కేంద్ర మంత్రి బండి సంజయ్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : మున్సిపల్ శాఖ మంత్రిగా ట్విట్టర్ టిల్లు దశాబ్ద కాల వైఫల్యాన్ని బయటపెట్టేందుకు హైదరాబాద్‌లో ఒక్క వర్షం సరిపోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ముస్లింలకు శ్మశానవాటికలు నిర్మించేందుకు ట్విట్టర్ టిల్లుకు ఒకే, కానీ హిందూ దేవాలయాల నిర్మాణం మాత్రం వద్దని చెప్పడంలో కేటీఆర్ లాజిక్ ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ముస్లింలకు శ్మశానవాటికలు డిమాండ్ చేస్తే తప్పులేదు కానీ.. బీజేపీ హిందూ దేవాలయం గురించి మాట్లాడితే మాత్రం క్రైమా? అని ప్రశ్నించారు. బంజారాహిల్స్ పెద్దమ్మ ఆలయ పునర్నిర్మాణం తప్పా? అని ఫైరయ్యారు. తాను దేవాలయాల గురించి మాట్లాడినప్పుడు, అభివృద్ధి గురించి కూడా మాట్లాడానని, కానీ మూర్ఖులు వారికి సరిపోయేది మాత్రమే వింటారని బండి చురకలంటించారు. జూబ్లీహిల్స్ అంటే బంగ్లాలే అని బీఆర్ఎస్ భావించిందని, ఇప్పుడు బస్తీలు కూడా మాట్లాడుతున్నందున కేసీఆర్ కుమారుడు పట్టించుకుంటున్నట్లు నటిస్తున్నాడంటూ విమర్శించారు.
Read Also- Street Dog Attacks: వీధి కుక్కల స్వైర విహారం.. ఎంతదారుణం!
బీఆర్ఎస్.. ఈ నగరాన్ని శ్మశానవాటికగా మార్చాలనుకుంటోందని విమర్శలు చేశారు. నగరంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. ప్రశ్నించడంలేదంటే మైనారిటీలను సంతృప్తి పరిచేందుకు కాదా? అని నిలదీశారు. కేసీఆర్ విశ్వాసంతో ఆడుకుని ఇప్పటికే మూల్యం చెల్లించుకున్నారని, కేటీఆర్ లాంటి నాస్తికులు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని నారాయణగూడ కేఎంఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో తెలంగాణ గో సేవా విభాగం ఆధ్వర్యంలో ‘గోవు పర్యావరణ పరిరక్షణలో శాస్త్రీయ విజ్ఞానం’పై ఆదివారం రాష్ట్రస్థాయి పరీక్షలు నిర్వహించారు. కాగా విజేతలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గోమాత మత విశ్వాసం కాదని, ఇస్లాంలోనూ గోవును పక్కనపెట్టుకుని నమాజ్ చేశారని గుర్తుచేశారు. ప్రపంచమంతా కౌ-బేస్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ పై దృష్టిసారిస్తోందని వివరించారు. గోమాత సేవలను పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోవును కాపాడితే ప్రకృతిని కాపాడినట్టేనన్నారు.
Read Also- Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?
సంఘ విద్రోహ శక్తులకు, రౌడీషీటర్లకు మద్దతిచ్చే వాళ్లు కూడా సంఘ విద్రోహశక్తులుగానే పరిగణించాలని బండి సంజయ్ అన్నారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు రాజీ పడొద్దని, ముఖ్యంగా సంఘ విద్రోహ శక్తులను కఠినంగా అణిచి వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో పోలీసులకు కేంద్రం పూర్తిగా అండగా ఉంటుందన్నారు. రౌడీషీటర్ అన్సారీ దాడిలో గాయపడి సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్, కానిస్టేబుల్ వీఎస్ఎన్ మూర్తిని బండి సంజయ్ కుమార్ ఆదివారం పరామర్శించారు. డీసీపీ, కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రౌడీషీటర్ అన్సారీ దాడితో డీసీపీ, కానిస్టేబుల్ తీవ్ర గాయాలు అయ్యాయని ఈ సందర్భంగా వైద్యులు కేంద్ర మంత్రికి వివరించారు. ప్రస్తుతం మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ చైతన్య, కానిస్టేబుల్ ను పరామర్శించిన బండి సంజయ్ వారు చూపిన తెగువను కొనియాడారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని, సంఘ విద్రోహ శక్తులను అణిచి వేయాల్సిందేనని చెప్పారు. ఈ విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.
