Indiramma Atmiya Bharosa: ఆత్మీయ భరోసా కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు వస్తుంది? అసలు వస్తుందా? రాదా? అని ఆందోళన చెందుతున్నారు. పథకం ప్రారంభించి మూడునెలలు దాటినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 83 వేల మంది లబ్ధిదారులకే ఆత్మీయభరోసా ఇచ్చారు. ఇంకా 4 లక్షలకుపైగా అర్హులకు ఇవ్వాల్సి ఉన్నది. మూడో విడుత ఎప్పటి నుంచి ఇస్తారో ప్రభుత్వం క్లారిటీ ఇస్తే భరోసా కల్పించినట్లు అవుతుంది.
ప్రతి మండలంలో ఓ గ్రామం ఎంపిక
పథకాన్ని ఈ ఏడాది జనవరి 26న ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఆ గ్రామంలో ఉపాధి కూలీలకు మొదటి విడతగా రూ. 6వేల రూపాయల చెక్కును అందజేశారు. గ్రామ సభలు నిర్వహించి కూలీలఖాతాల్లో నిధులను ప్రభుత్వం జమ చేసింది. డీబీటీ పద్ధతిలో ఉపాధి కూలీల ఖాతాల్లోకి నేరుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను జమ చేస్తున్నది.
మొత్తం 18,180 మందికి తొలివిడుతగా చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ కోడ్ కారణంగా పథకానికి అడ్డంకిగా మారడంతో పథకాన్ని నిలిపివేశారు. అయితే కోడ్ లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఫిబ్రవరి 27న రెండో విడుత లబ్ధిదారులకు అందజేశారు. 66,240 మంది లబ్ధిదారులకు 39.74 కోట్లు అందజేశారు.
మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్ లో 9035, నాగర్‌కర్నూల్‌లో 9137, నారాయణపేటలో 3541, వనపర్తిలో 6525, జోగులాంబ గద్వాలలో 9100 మందికి అందజేయగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్‌లో 621 మందికి, రంగారెడ్డిలో 10050, వికారాబాద్ లో 18231 మంది లబ్ధిదారులకు ఆత్మీయభరోసా అందజేశారు. రెండు విడుతల్లో మొత్తం 83887 మంది ఉపాధి కూలీలకు 50 కోట్ల 33 లక్షలు చెల్లించారు. ఇందులో ఎస్సీలకు 24230 మందికి, ఎస్టీలకు 10702, బీసీలకు 43568, మైనార్టీలు 2816, ఇతరులు 2571 మందికి ఆత్మీయ భరోసా అందజేశారు.
మూడు నెలలు గడిచినా..
ఈ పథకాన్ని ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా పథకానికి 4లక్షల 13వేల 857 మంది కూలీలను అర్హులుగా ఎంపిక చేశారు. వీరికి భరోసా పథకం అమలు చేయాలంటే రూ. 298 కోట్లు అవసరం ఉంది. దీనికి సంబంధించి టోకెన్లు, చెక్కులు కూడా జనరేట్ అయ్యాయని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అధికారికంగా ప్రభుత్వం ప్రకటనసైతం చేయడం లేదు. ప్రభుత్వం అర్హులందరికీ పథకం అందజేస్తామని ఇప్పటికే ప్రకటించింది. కానీ నెలలు గడుస్తున్నా పథకం ముందుకు సాగకపోవడంతో అసలు ఇస్తారా? లేదా? అనేది పలు అనుమానాలకు తావిస్తున్నది.
అడ్డంకిగా మారిన నిధులు?
ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతోనే పథకం ముందుకు సాగడం లేదని ప్రచారం జరుగుతున్నది. ఇతర అవసరాలకు నిధులు నిలిపి అయినా సరే ఆత్మీయ భరోసా పథకాన్ని కొనసాగించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయిన తర్వాత వెంటనే మిగిలిన ఉమ్మడి జిల్లాలు నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నెలలు గడుస్తున్నా పథకంపై ప్రకటన చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: CS Shanti Kumari: శాంతికుమారికి షాక్ తప్పదా? కొత్త సీఎస్ పోస్టు ఎవరిది?
విపక్షాలకు ప్రచార అస్త్రంగా..
ఆత్మీయ భరోసా పథకం విపక్షాలకు ప్రచార అస్త్రంగా మారుతున్నది. ఆర్భాటంగా పథకాన్ని ప్రారంభించి కొంతమందికే ఇచ్చే ఇతరులకు మొండిచెయ్యి చూపుతున్నదని బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం విమర్శలు ఎక్కుపెట్టింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇదే ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని భావిస్తున్నాయి. లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారు. సందర్భం ఏదైనా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వాటికి చెక్ పెట్టాలంటే ప్రభుత్వం లబ్ధిదారులందరికీ తొలి విడుతగా 6వేలు అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సీతక్క చొరవ చూపితేనే..
పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సీతక్క ఉన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఆమె శాఖ పరిధిలోకి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పథకంలో పనిచేసే కూలీలకే వర్తింప జేస్తుండటం, ఏటా 12వేలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంకా రాష్ట్రంలో 4,13,857 అర్హులు ఉన్నారు. వీరందరికీ తొలి విడతగా రూ.6వేలు అందజేయాల్సిన అవసరం ఉంది. సీతక్క చొరవ తీసుకుంటేనే పథకం ముందుకు పోయే పరిస్థితి లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు