Warning for Drinkers
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Warning for Drinkers: మందుబాబుల చిందులు ఇక చెల్లవు!

Warning for Drinkers: మద్యం తాగి రాద్దాంతం చేస్తే క్రిమినల్ కేసులే

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న డ్రింకర్ల న్యూసెన్స్ కేసులు
తాగి, దొరికి.. ట్రాఫిక్ సిబ్బందితో కయ్యానికి దిగుతున్న మందుబాబులు
పోలీసులపైనే దాడులకు తెగబడుతున్న వైనం
మత్తు వీడేలా నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్న పోలీసులు
హద్దు మీరితే జైలుకే అంటున్న వరంగల్ పోలీసులు

వరంగల్, స్వేచ్ఛ: మందు బాబులం… మేము మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహా రాజులం అన్నటుగా మద్యం మత్తులో పలువురు మందుబాబులు విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా (Warning for Drinkers) వ్యవహరిస్తున్నారు. ఏకంగా పోలీసుల మీదికే తిరగబడి దాడికే యత్నిస్తున్నారు. మద్యం మత్తులో చిత్తు అవుతూ వింతవింతగా ప్రవర్తిస్తూ పోలీసుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు మందుబాబులు మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడమే ప్రమాదాలకు ఎక్కువ కారణాలని గుర్తించిన ప్రభుత్వం ప్రమాదాల నియంత్రణ కోసం బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లు నిర్వహించి మందుబాబులను పట్టుకునే బాధ్యతను పోలీసులకు అప్పగించారు.

అయితే, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న పోలీసులతో వాదనకు దిగడం, విచక్షణ రహితంగా రాద్దాంతం చేస్తూ లిక్కర్ కిక్కులో ట్రాఫిక్ పోలీసులు, పోలీసులను దూషించడం, దాడులకు తెగబడుతుండడం చేస్తున్నారు. అయితే, ఇలా పోలీసులపై రెచ్చిపోతున్న మందుబాబుల ఆట కట్టించేందుకు వరంగల్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మద్యం మత్తులో లెక్క తప్పితే నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద నమోదు చేసి జైలుకు పంపించి, ఊచలు లెక్క పెట్టిస్తున్న అంశానికి సంబంధించి ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనం.

రోడ్డుపై పోలీసులను పరుగు పెట్టించి.. జైలుపాలయ్యాడు.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ ముందు జూలై 9న మారపల్లి శేఖర్ అనే యువకుడు మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసుల కంటపడ్డాడు. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌కు సహకరించాలని కోరిన పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఎంత సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా రోడ్డుపై పోలీసులను పరుగులు పెట్టించాడు. పోలీసులను దూషిస్తూ ఇబ్బంది పెట్టిన అతడిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టి పోలీసులు జైలుకు పంపించారు. మద్యం మత్తులో చేసిన పనికి జైలు తప్పలేదు.

అసభ్యంగా ప్రవర్తించి..

పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవలే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న పోలీసుకు కమ్మగాని వెంకన్న అనే వ్యక్తి దొరికాడు. బ్రీట్ అనలైజర్ టెస్ట్‌కి సహకరించకుండా ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తిని పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ మహిళా కానిస్టేబుల్ ముందు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో, తిక్క రేగిన పోలీసులు నాన్ -బెయిలబుల్ కేసు పెట్టి జైలుకు పంపించారు.

లెక్క తప్పి జైలులో ఊసలు లెక్కపెట్టాడు

హనుమకొండ జిల్లా పలివేల్పులకు వెళ్ళే రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. మడికొండకు చెందిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసుల కంటపడ్డాడు. పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా.. మద్యం తాగినట్లుగా తేలింది. పరీక్షలు నిర్వహించిన పోలీసులతో రాజశేఖర్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు. వారిని దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో లెక్క తప్పిన అతడిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు.

Read Also- Sahasra case: సహస్ర కేసుపై జనం వ్యక్తం చేస్తున్న సందేహాలు ఇవే!

తాను దొరికి.. మిత్రులను ఇరికించి..

ఇటీవలే కేయూ జంక్షన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టేస్టు నిర్వహిస్తున్న పోలీసులకు భీమారంకు చెందిన సాయికుమార్ చిక్కాడు. అతనికి బ్రీత్ అనలైజర్ టెస్టు నిర్వహించగా.. మద్యం సేవించినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ చేశారు.. ఈవిషయం తెలిసి అక్కడికి చేరుకున్న సాయికుమార్ స్నేహితులు రవీందర్, ఆరిఫ్ మద్యం మత్తులో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, దుర్భాషలాడిన నేపథ్యంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ రవికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేయూ పోలీసులు ముగ్గురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.

సగటున 80 మంది పట్టుబడుతున్నారు

వరంగల్ కమిషనరేట్ లో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మద్యం మత్తులో జరుగుతున్నవే ఎక్కువగా ఉన్నాయి. ప్రమాదాల నియంత్రణ కోసం గ్రేటర్ వరంగల్ నగరంలోని హనుమకొండ, కాజీపేట, వరంగల్ ట్రాఫిక్ స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు గత సంవత్సరం 20,338 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి, 96 మందిని జైలుకు పంపించారు. రూ.1.8 కోట్ల వరకు ఫైన్లు విధించారు. ఈ ఏడాదిలో ఇప్పటికే సుమారు 13 వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. ప్రతి రోజు సగటున 80 మంది వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడుతుండగా వారికి కమిషనరేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ లో కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు కోర్టులో హాజరుపరిచి జరిమానాలు, తీవ్రత ఎక్కువ ఉంటే జైలు శిక్షలు అమలు అయ్యేలా చేస్తున్నారు.

Read Also- Charla mandal: భద్రాద్రి జిల్లాలో దారుణం.. గిరిజన యువతిపై ఆటో డ్రైవర్ల..

అడ్డుకున్న పోలీసులపై దాడులు

మద్యం సేవించి వాహనం నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారిలో కొందరు పోలీసులపైన తిరగబడుతున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ దాడులకు పాల్పడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటీవల పలివేల్పుల క్రాస్, కేయూ జంక్షన్ వద్ద జరిగిన ఘటన అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇటీవలే హనుమకొండ బస్టాండ్ సమీపంలో విద్యారణ్యపురికి చెందిన అర్షద్ అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి, ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన సీఐతో పాటు మరో కానిస్టేబుల్ రమేశ్ పైనా దాడికి ప్రయత్నించాడు. అంతకుముందు సుబేదారి పీఎస్ పరిధిలో వడ్డేపల్లి వద్ద సిగ్నల్ జంప్ చేసిన వెహికిల్ ఫొటో తీసినందుకు కారు ఓనర్ కానిస్టేబుల్ పై దాడికి దిగారు. ఇలా మద్యం మత్తులో కొందరు వాహనదారులు పోలీసులపైనే దాడులకు దిగుతున్నారు.

హద్దు మీరితే క్రిమినల్ కేసులు.. జైలుకే

తాగిన మైకంలో విచక్షణ మటించి హద్దు మీరి ప్రవర్తిస్తే వారిపై వరంగల్ ట్రాఫిక్ పోలీసులు రూల్స్ మరింత కఠినం చేశారు. స్ట్రిక్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, దుర్భాషలాడటం, దాడులకు దిగుతున్న వారిపై క్రిమినల్ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారు. ఫలితంగా నిందితులు క్రైమ్ రికార్డ్స్ లోకి ఎక్కడంతో పాటు పాస్ పోర్టు పొందాలన్నా.. ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలన్నా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేశవ్యాప్తంగా అమలవుతున్న క్రైమ్‌ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్(సీసీటీఎన్ఎస్)లోనూ వివరాలు నమోదవుతాయి. దీంతో భవిష్యత్తులో అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద కోర్టు తీర్పు ప్రకారం ఏడేండ్ల నుంచి పదేండ్ల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని వరంగల్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. భవిష్యత్ పరిణామాలు దృష్టిలో ఉంచుకుని అనవసరంగా కేసుల్లో ఇరుక్కోకుండ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ