TG Liquor License: వైన్ షాపుల కేటాయింపు కోసం పిలిచిన దరఖాస్తుల గడువు పెంపు ఉండదని ఎక్సయిజ్ అధికారులు స్పష్టం చేశారు. గడువును పెంచే అవకాశాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచించారు. ఈనెల 18వ తేదీతో గడువు ముగియనున్నందున ఈలోపే ఆసక్తిగలవారు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. 19, 20వ తేదీల్లో దీపావళి పండుగ ఉందని, ఆ తరువాత రెండు రోజులపాటు షాపుల కేటాయింపు కోసం లక్కీ డ్రా(Lucky draw) నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 23న ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ఏ4 మద్యం షాపుల డ్రా జరుగుతుందని చెప్పారు. క్రితంసారి నోటిఫికేషన్ జారీ చేసినపుడు చివరి రెండు రోజుల్లోనే 75శాతం అప్లికేషన్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈసారి కూడా చివరి రెండు మూడు రోజుల్లో భారీ సంఖ్యలో అప్లికేషన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు..
నోటిఫికేషన్ జారీ అయి నెలన్నర రోజులు గడిచినా అప్లికేషన్ల సంఖ్య 2వేలకు కూడా చేరుకోలేదు. దరఖాస్తు చేసుకోవటానికి చెల్లించే నాన్ రీ ఫండబుల్ ఫీజును 2 నుంచి 3 లక్షలకు పెంచటమే కారణమన్న చర్చ జోరుగా నడిచింది. దాంతో అలర్ట్ అయిన ఉన్నతాధికారులు జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. గత ఏడాది 1.32లక్షల అప్లికేషన్లు వచ్చాయని, ఈసారి వాటి సంఖ్య కనీసం 1.50లక్షలు దాటేలా చూడాలని సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఆయా ఎక్సయిజ్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఇప్పటికే షాపులు నడుపుతున్న వారితోపాటు గతంలో ఇదే వ్యాపారం చేసిన వారిని, డబ్బున్న బడా బాబులతో వైన్ షాపుల కోసం అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పారు. షాపు దక్కిందంటే జాక్ పాట్ కొట్టినట్టే అని చెప్పారు. ఈనెల 18వ తేదీ చివరి గడువు కావటం వల్ల తొందర పడాలని సూచించారు. ఎక్సయిజ్ సిబ్బంది పడ్డ ఈ శ్రమ ప్రస్తుతం ఫలితాలను ఇస్తోంది. గడిచిన మూడు రోజుల్లోనే 4,082 దరఖాస్తులు అధికారులకు అందాయి. దాంతో ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 5,663కు పెరిగింది.
Also Read: Seethakka: ఈ ప్రాజెక్టుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం.. సీతక్క కీలక వ్యాఖ్యలు
ఏ పని చేసినా మంచి రోజు
మద్యం వ్యాపారంలో ఉన్న చాలామంది ముహూర్తాలు చూసుకోవటం సర్వసాధారణం. ఏ పని చేసినా మంచి రోజు చూసుకుంటుంటారు. సోమవారం నుంచి దరఖాస్తులకు ఆఖరు గడువు అయిన 18వ తేదీ వరకు అన్నీ మంచి రోజులే ఉన్నాయి. దాంతో ఈ రోజుల్లో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. క్రితంసారి నోటిఫికేషన్ జారీ చేసినపుడు కూడా చివరి రెండు రోజుల్లోనే 50వేల వరకు అప్లికేషన్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
Also Read: Sangareddy District: డీసీసీ అధ్యక్షుల ఆమోదం లేకుండా ఎమ్మెల్యే టికెట్లు
