NHM Salary Pending: రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నేషనల్ హెల్త్ మిషన్(National Health Mission) ఉద్యోగుల పరిస్థితి దీన స్థితిలో తయారైంది. వేల సంఖ్యలో ఉన్న ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇళ్లలో మాత్రం నిరాశే మిగిలింది. గడిచిన మూడు నెలలుగా జీతాలు అందక, అప్పుల ఊబిలో కూరుకుపోయి పండుగ పూట పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని జిల్లాల్లో మూడు నెలలు, మరి కొన్ని రెండు జిల్లాల వరకు వేతనాలు ఇప్పటికీ అందలేదు. ఎన్ హెచ్ ఎం పరిధిలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ల వరకు అందరిదీ జీతాలు రాక సత మవుతున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల వేతనాలు ఇప్పటికీ జమ కాలేదు. ప్రతినెలా ఒకటో తారీఖున రావాల్సిన జీతం కోసం మూడు నెలలుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దీనితో ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, నిత్యావసర వస్తువుల ఖర్చులకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బడ్జెట్ సాకులు.. ఆఫీసర్ల నిర్లక్ష్యం?
జీతాల గురించి అధికారులను ప్రశ్నిస్తే, “బడ్జెట్ లేదు.. కేంద్రం నుంచి నిధులు రాలేదు” అనే పాత పాటే వినిపిస్తోంది. నిధుల విడుదలలో సాంకేతిక కారణాలు చూపుతూ కాలయాపన చేయడం పట్ల ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. దాదాపు 20 వేల మంది ఉద్యోగులను ఇబ్బంది పెట్టడంసరికాదన్నారు. క్షేత్రస్థాయిలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న సిబ్బంది పట్ల ప్రభుత్వం ఇంతటి ఉదాసీనత వహించడం భావ్యం కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ”కరోనా వంటి విపత్కర కాలంలో ప్రాణాలకు తెగించి పనిచేశాం. కానీ నేడు పండుగ పూట మా పిల్లలకు కనీసం కొత్త బట్టలు కొనిచ్చే స్థితిలో కూడా లేము. మా కష్టం పాలకులకు కనబడదా?”అని ఒక బాధిత ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆగమ్యగోచరంగా ఆరోగ్యశాఖ సిచువేషన్
హెల్త్ మిషన్‌లో పనిచేస్తున్న వేలమంది సిబ్బంది భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిరంతరాయంగా సేవలు అందిస్తున్నప్పటికీ, కనీస వేతనాలు అందకపోవడంతో విధులకు హాజరుకావడమే భారంగా మారుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి, ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

