Medchal Congress: అలియాబాద్ నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
మేడ్చల్, స్వేచ్ఛ: మేడ్చల్ నియోజకవర్గంలోని ఎల్లంపేట్, మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలకు (Medchal Congress) సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నాడు అలియాబాద్‌లోని శుభం ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) హాజరై పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యం: కోమటి రెడ్డి
‘‘ 50 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కలను సాకారం చేసింది. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది” అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సర్వే ఆధారంగా ప్రజల్లో ఆదరణ ఉన్నవారికే, గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులకే పారదర్శకంగా టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. మున్సిపాలిటీల ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన కార్యాలయంలో ప్రత్యేక సిబ్బందిని నియమిస్తానని హామీ ఇచ్చారు. “ఎన్నికల కోసం వచ్చి వెళ్లే నేతను కాదు. మాటిస్తే కట్టుబడి పనిచేసే నాయకుడిని. నాకు నల్లగొండ ఎంత ముఖ్యమో.. మీరంతా కూడా అంతే” అంటూ కార్యకర్తల్లో మంత్రి ఆత్మవిశ్వాసం నింపారు.
బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం కల మాత్రమేనని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. పార్లమెంట్‌లో ఒక్క సీటు కూడా రాని పార్టీ అధికారం ఎలా సాధిస్తుందో చెప్పాలంటూ కేటీఆర్ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో 70 శాతం కాంగ్రెస్, 10 శాతం కాంగ్రెస్ రెబల్స్ గెలిచారని గుర్తుచేస్తూ, పార్టీ గుర్తుతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కనీసం 10 శాతం అయినా గెలవాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ సభకు రాకపోవడం ప్రజాస్వామ్యానికి అవమానమన్నారు.
Read Also- Davos summit 2026: సీఎం రేవంత్ సంచలనం.. తెలంగాణలో స్టీల్ ప్లాంట్.. దావోస్‌లో గేమ్ ఛేంజింగ్ ఒప్పందం!
ప్రజల్లోనే ఉంటూ అభివృద్ధి చేస్తున్నాం : డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్
డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోనే ఉంటూ నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. పట్నం మహేందర్ రెడ్డితో కలిసి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు. మహిళల సాధికారత లక్ష్యంగా కుట్టు మిషన్లు, చీరల పంపిణీ చేపట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేడ్చల్ నియోజకవర్గంలో 82 వేల మందికి ఉచిత విద్యుత్, 3,500 ఇండ్ల నిర్మాణం వంటి కీలక అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు. ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలకు దూరంగా ఉన్నారని, ఓడినప్పటికీ తాము ప్రజల్లోనే ఉంటూ సేవ చేస్తున్నామని విమర్శించారు. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలిస్తేనే జీహెచ్ఎంసీలో పార్టీకి పట్టు వస్తుందని పేర్కొన్నారు.
ఇంచార్జీల నియామకం
ఎల్లంపేట్ మున్సిపాలిటీ : మాజీ జడ్పిటిసి శరత్ చంద్ర రెడ్డి, మహేష్ గౌడ్
అలియాబాద్ మున్సిపాలిటీ : కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్, మహిపాల్ రెడ్డి
మూడుచింతలపల్లి మున్సిపాలిటీ : బోడుప్పల్ మాజీ మేయర్ అజయ్ యాదవ్, అమర్ సింగ్
టికెట్ల కేటాయింపులో సర్వే కీలకం
టికెట్ల పంపిణీలో సర్వే రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని, 68 మంది కౌన్సిలర్లలో 38 మందికి మహిళలకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. యువతకు పెద్దపీట వేస్తామని, మూడు మున్సిపాలిటీలను తప్పకుండా కాంగ్రెస్ ఖాతాలో వేస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
Read Also- GHMC: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లకు కసరత్తు ప్రారంభం.. ఎన్నికల నిర్వహణ పై కీలక అప్డేట్..?
పనిచేసే నాయకులకే అవకాశాలు: మాజీ డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి
ప్రజలతో నేరుగా మమేకమై పనిచేసే నాయకులకే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని అన్నారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ ఇకపై హాల్ మీటింగులు కాకుండా నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి సమావేశాలు నిర్వహిస్తుందని, రానున్న రోజుల్లో ప్రజలతోనే మీటింగులు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలే నాయకులకు టికెట్లు ఇచ్చే విధంగా వ్యవస్థను తీసుకువస్తామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్లు ఇస్తామని, హరివర్ధన్, వజ్రేష్, సుధీర్ రెడ్డి వర్గాలు అంటూ ఏమీలేవని స్పష్టంగా చెప్పారు.ప్రతి 100 ఓట్లకు ఒక ఇంచార్జ్‌ను నియమిస్తామని, పార్టీకి అంకితభావంతో పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇస్తామనితెలిపారు.యువకులకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని, మూడు మున్సిపాలిటీలను తప్పకుండా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
చైర్మన్ మనవాళ్లుంటేనే అభివృద్ధి సాధ్యం: మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్లంపేట్-మూడుచింతలపల్లి-అలియాబాద్ మున్సిపాలిటీల అభివృద్ధి కోసం గతంలో రూ.45 కోట్ల నిధులు మంజూరు చేయించామని వెల్లడించారు.మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు సక్రమంగా జరగాలంటే చైర్మన్ మనవాళ్లు అధికారంలో ఉండటం అత్యవసరం అని స్పష్టం చేశారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు ప్రతి 100 ఓట్లకు ఒక బాధ్యతాయుత కార్యకర్తను నియమించే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల వ్యూహంలో ప్రతి ఓటుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
బీఆర్ఎస్ రాజకీయాలకు కాలం చెల్లింది : నక్క ప్రభాకర్ గౌడ్
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలతో బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా బొంద పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ మహిపాల్ రెడ్డి, బోడుప్పల్, జవహర్‌నగర్ మాజీ మేయర్లు అజయ్ యాదవ్, శాంతి కోటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహ యాదవ్,రాపోలు రాములు, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు విఘ్నేశ్వర రెడ్డి, వెంకటేష్, రమేష్,మాజీ కౌన్సిలర్లు,మాజీ సర్పంచ్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

