Ration Shops: సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టాన్ని మిగులుస్తోంది. సమయానికి తరలించాల్సిన దొడ్డు బియ్యం (రేషన్ బియ్యం) నెలలు గడుస్తున్నా రేషన్ దుకాణా (Ration Shops)ల్లోనే ముక్కిపోతున్నాయి. ఎలుకలు, పురుగులు పట్టి, పూర్తిగా పనికిరాకుండా పోతున్న ఈ కోట్ల విలువైన ధాన్యంపై అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. దీంతో ప్రభుత్వ సొమ్ము ఎవరి పాలవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సన్నబియ్యం రావడంతో
రాష్ట్ర వ్యాప్తంగా 17,200కు పైగా ఉన్న రేషన్ దుకాణాలకు ప్రభుత్వం గత మార్చి నెలలో దొడ్డు బియ్యాన్ని సరఫరా చేసింది. కొంతమంది రేషన్ తీసుకెళ్లకపోవడంతో ఈ స్టాక్ దుకాణాల్లో మిగిలిపోయింది. వాస్తవానికి, మిగిలిన ఈ బియ్యాన్ని ఏప్రిల్‌లో వచ్చే స్టాక్‌తో కలిపి పంపిణీ చేయాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేపట్టడంతో, మార్చిలో మిగిలిన దొడ్డు బియ్యం అలాగే రేషన్ షాపుల్లో ఉండిపోయింది. ఆ స్టాక్ వివరాలను డీలర్లు ప్రభుత్వానికి అందజేశారు. పౌరసరఫరాల శాఖ అధికారులు ఆ బియ్యాన్ని రిటర్న్ తీసుకోవాల్సి ఉన్నా, ఎనిమిది నెలలు గడిచినా ఇప్పటివరకు తరలించకపోవడంతో బియ్యం నాణ్యత పూర్తిగా దెబ్బతింది.
వినతులు ఇచ్చినా స్పందన కరువు
అధికారులు గతంలోనే డీలర్లకు కిలో రూ.24 చొప్పున కొనుగోళ్లు జరుగుతాయని, టెండర్ వేశామని, రేషన్ షాపుల నుంచి త్వరలో తీసుకెళ్తామని చెప్పారు. అయినప్పటికీ నవంబర్ మాసం కూడా గడుస్తున్నా స్పందన కరువైంది. దొడ్డు బియ్యాన్ని తరలించాలని రేషన్ డీలర్లు జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులకు వినతులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఒక్కో రేషన్ దుకాణంలో సుమారు 20 నుంచి 30 క్వింటాళ్లకు పైగా దొడ్డు బియ్యం ఉన్నట్లు సమాచారం. వీటి మొత్తం విలువ 2 నుంచి 300 కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత నష్టం జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం ఏంటనేది ఇప్పుడు విస్తృత చర్చనీయాంశంగా మారింది.
Also Read: Crowd at Ration Shops: మూడు నెలల బియ్యానికి.. ముప్పు తిప్పలు!
తరుగు బాధ్యత ఎవరిది?
కొంతమంది డీలర్లు అద్దె మడిగలను తీసుకొని రేషన్ సరఫరా చేస్తుండగా, కార్డుల ప్రకారం వచ్చే బియ్యంతో పాటు ఈ దొడ్డు బియ్యం స్టాక్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక, దొడ్డు బియ్యానికి పట్టిన పురుగులు, ఎలుకలు సన్నబియ్యం స్టాక్‌పైకి కూడా వస్తుండటంతో కొంతమంది వినియోగదారులు ప్రశ్నిస్తున్నారని, బియ్యం తీసుకోవడానికి నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. 8 నెలల క్రితం స్టాక్ వివరాలను ప్రభుత్వానికి అందజేసినప్పటికీ, ఇప్పటివరకు తరలించకపోవడంతో ఈ బియ్యం తరుగు అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ తరుగు భారాన్ని ఎవరిపై వేస్తారనేది హాట్ టాపిక్ అయింది. డీలర్లపై వేస్తే, అధికారుల వైఫల్యాలను ఎలా కప్పిపుచ్చుకుంటారనేది విస్తృత చర్చ జరుగుతుంది. దీనిపై రేషన్ డీలర్లు లోలోన తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
రేషన్ డీలర్ల సంఘం డిమాండ్
రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ, దొడ్డు బియ్యం స్టాక్ వివరాలను మార్చిలోనే ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు. ‘రేషన్ దుకాణాల్లో స్టాక్ పెట్టుకునేందుకు వసతి లేదు. తరలించాలని 20 వరకు వినతిపత్రాలు ఇచ్చాం. నెలలు గడుస్తున్నాయి తప్ప అధికారులు మాత్రం దొడ్డు బియ్యాన్ని తరలించడం లేదు. పురుగులు పట్టి, తరుగు అవుతుంది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తరలింపునకు చర్యలు తీసుకోవాలి’ అని రాజు డిమాండ్ చేశారు.
Also Read: Ranga Reddy District: పక్కదారి పడుతున్న గోధుమలు.. సందట్లో సడేమియాలా డీలర్ల తీరు!

