Uttam Kumar Reddy: సహజ వనరులను వినియోగించడం ద్వారా వరద ప్రమాదాలను నివారించడంతో పాటు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు సమృద్ధిగా సాగు నీరు అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మున్నేరు -పాలేరు లింక్ పథంకం నిర్మాణం చేపట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పేర్కొన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.162.57 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ లింక్ కాలువ పొడవు 9.6 కిలోమీటర్లు కాగా ఇది సెకనుకు 4,500 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని 1.38 లక్షల ఎకరాలకు నీటి స్థిరీకరణతో పాటు పాలేరు రిజర్వాయర్ ఎగువ భాగంలోని 40 ఎకరాల ఎన్‌ఎస్‌పీ ఆయకట్టుకు నీటి భద్రత లభిస్తుందని ఉత్తమ్ వెల్లడించారు.
70,308 ఎకరాల ఆయకట్టు
మున్నేరు నది నుంచి ప్రతి సంవత్సరం వచ్చే వరద నీటిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు వృథాగా పోతున్న సుమారు 50 టీఎంసీల నీటితో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసిందని వివరించారు. ఖమ్మం జిల్లాలో మున్నేరు నుండి వస్తున్న నీటితో సంభవిస్తున్న నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వ నిర్ణయం దోహద పడుతుందన్నారు. మున్నేరు నది వరద జలాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూర్ గ్రామంలోనీ చెక్ డ్యామ్ ద్వారా నీరు మళ్లించి నిర్మించే మున్నేరు – పాలేరు లింక్ పథకంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2ను బలోపేతం చేయడంతో పాటు పాలేరు రిజర్వాయర్ ద్వారా భక్త రామదాసు ఎత్తిపోతల పథంకం కింద ఉన్న డీబీఎం 60 ద్వారా ఖరీఫ్ సాగు కోసం 70,308 ఎకరాల ఆయకట్టుకు అదనపు నీటి లభ్యత చేకూరుతుందని వివరించారు.
విద్యుత్ చార్జీల భారం కూడా తగ్గుతుంది
అదే విదంగా సూర్యాపేట జిల్లాలోని మోతే ఎత్తిపోతల పథంకం ద్వారా డీబీఎం 71 కింద ఉన్న 46,712 ఎకరాల భూమికి నిరంతరం సాగు నీటిని అందించవచ్చన్నారు. ఈ ప్రాజెక్టుతో కేవలం సాగు నీరు మాత్రమే కాకుండా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో తాగు నీటి అవసరాల కోసం మిషన్ భగీరథ పథకానికి 4.70 నీటిని కేటాయిస్తున్నట్లు వివరించారు. అన్నింటికీ మించి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా సీతారామ ప్రాజెక్ట్‌కు వినియోగించేందుకు వినియోగిస్తున్న విద్యుత్ చార్జీల భారం కూడా తగ్గుతుందని తెలిపారు. అదనపు నీటితో పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న హైడల్ ప్లాంట్‌లో 2 మెగా వాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా మున్నేరు ఉగ్ర రూపం దాల్చిన ప్రతి సమయంలో అతలాకుతలం అయ్యే ప్రాంతాల ప్రజలకు ఇకపై ఎటువంటి ఇబ్బంది కలగదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.

