MP Kishan Reddy: బీజేపీ లో మళ్లీ ముసలం మొదలైంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీగా ఎవరనే అంశంపై స్పష్టత కరువైంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ తో మరోసారి ఈ ఇష్యూ తెరపైకి వచ్చింది. గతంలో కూడా కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇదే తరహా కామెంట్స్ చేశారు. పార్టీ కొత్తగా ఎవరినీ ఇన్ చార్జీగా నియమించలేదని వ్యాఖ్యానించడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో అభయ్ పాటిల్ తెలంగాణకు వచ్చారు. ఎన్నికల ఇన్ చార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. 8 లోక్ సభ స్థానాల్లో పార్టీ కూడా గెలిచింది. కానీ అభయ్ పాటిల్ ను మాత్రం రాష్ట్ర వ్వవహారాల ఇన్ చార్జీగా అధికారికంగా ప్రకటించలేదు. కేవలం వెబ్ సైట్ లో మాత్రమే ఇన్న చార్జీగా పార్టీ పేర్కొంది. దీని వెనుకున్న కారణాలేంటనేది సస్పెన్స్ గా మారింది.అభయ్ పాటిల్ కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే.
ముక్కుసూటి మనిషి అని ఆయనకు పేరుంది. కాగా పార్టీ వెబ్ సైట్ లో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీగా ఆయన పేరు ఉన్నా.. కిషన్ రెడ్డి మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన అనుభవమున్న నేపథ్యంలో గౌరవపూర్వకంగా కేవలం సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా తెలంగాణకు రావాల్సిందిగా ఇన్విటేషన్ ఇచ్చామని చెబుతుండటంతో చర్చ షురూ అయింది.
ఇదిలా ఉండగా రాష్ట్ర ఇన్ చార్జీగా తనను నియమించారని అభయ్ పాటిల్ ఇటీవల సోషల్ మీడియా ఎక్స్ వేదికగా గతేడాది సెప్టెంబర్ లోనే పేర్కొన్నారు. ఆ సమయంలో కూడా కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వయంగా ఎంటర్ అయి పార్టీ ఇన్ చార్జీగా ఎవరినీ నియమించలేదని స్పష్టంచేశారు. తాజాగా మరోసారి ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేయడంతో అభయ్ పాటిల్. రాష్ట్ర నాయకత్వానికి మధ్య పొసగడం లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
తెలంగాణ బీజేపీ ఇన్ చార్జీగా అభయ్ పాటిల్ ను వెబ్ సైట్ వరకే పరిమితం చేయడంతో టీబీజేపీలో ఆయన రోల్ ఏంటనే ప్రశ్నలు శ్రేణుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. అభయ్ పాటిల్.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ఇన్ చార్జీగా ఇక్కడ పనిచేశారు. పార్లమెంట్ ఎన్నికల తెలంగాణ ఇన్‌చార్జీగా గ్రౌండ్ లెవల్ లో మైక్రో అబ్జర్వేషన్ చేశారు. ఆయన తీరు చాలా మంది నేతలకు అప్పట్లో నిద్ర పట్టనివ్వలేదు. ఆయన మీటింగ్ కు వస్తున్నారంటే ఎవరైనా సరే జంకాల్సిందే.
Also Read: CM Revanth Reddy: సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం.. శంషాబాద్ హోటల్‌లో కలకలం
ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా కొట్టినట్టు చెప్పడం ఆయన నైజం. ఎవరో ఏమో అనుకుంటారని అస్సలు అనుకోరు. ఆయన మీటింగ్ కు సమయానికి రాకుంటే ఎంత పెద్ద నేత అయినా సరే.. అలస్యం చేస్తే గేట్ బంద్ చేసి మరీ హాజరైన వారితోనే కొనసాగిస్తారనే పేరుంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇక్కడి నేతలు పలువురు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారు. దీంతో ఆయన మీటింగ్ అంటే జంకాల్సిన పరిస్థితికి వచ్చింది. సమయానికి ఉండాలనే అలర్ట్ మొదలైంది.
ఇదిలా ఉండగా బీజేపీ జాతీయ నాయకత్వం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో సభ్యత్వ నమోదు ఇన్ చార్జీగా సైతం ఆయన రాష్ట్రంలో పర్యటించారు. ఆ సమయంలోనూ.. బీజేపీలో తాను ఫలానా వ్యక్తి శిష్యుడిని అని, తనను ఎవరేం చేస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని తనదైన శైలిలో చురకలంటించారు. తాను ఎమ్మెల్యే అని, ఎంపీ అని భేషజాలకు పోకుండా ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చిన సభ్యత్వాల టార్గెట్ ను పూర్తిచేయాల్సిందేనని నొక్కి చెప్పారు.
Also Read: oBhu Bharati Act: భూ భారతి అప్పీల్ చేయాలా?.. ఈ రూల్స్ తెలుసుకోండి!
లేదంటే పదవులు పోతాయని హెచ్చరించారు. దీన్ని బట్టి చూస్తుంటే.. పనిచేయకుండా కబుర్లు చెప్పే నాయకులకు ఆయనంటే అస్సలు గిట్టడం లేదని తెలుస్తోంది. అలాంటి వాళ్లను పాటిల్ దరిదాపుల్లోకి కూడా రానివ్వరని సమాచారం. అయితే ఆయన విధానాలు తెలంగాణ బీజేపీలో పలువురికి నచ్చడంలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే రాష్ట్ర ఇన్ చార్జీగా ఆయన వద్దని ఇక్కడి నేతలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ అంశంపై తాజాగా కిషన్ రెడ్డి కామెంట్స్ తో మరోసారి ఈ ఇష్యూ తెరపైకి వచ్చింది. దీంతో తెలంగాణ బీజేపీకి రాష్ట్ర ఇన్ చార్జీ ఎవరన్నది శ్రేణులు సైతం తేల్చుకోలేక పోతున్నాయి. మరి ఈ కన్ఫ్యూజన్ కు పార్టీ ఎప్పుడు చెక్ పెడుతుందో చూడాలి. కనీసం కొత్త స్టేట్ చీఫ్ నియామకం తర్వాత అయినా ఈ అంశంపై స్పష్టత వచ్చేనా? లేదా? అన్నది చూడాలి.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు