MLC Kavitha: భవిష్యత్‌లో తాను గనుక తెలంగాణ ముఖ్యమంత్రిని (Telangana) అయితే రాష్ట్రంలోని తల్లిదండ్రులు ఎవరూ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే వారి పిల్లల్ని చదివించుకునేలా చేస్తానని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చెప్పారు. ఒక్క ఉచిత విద్య మాత్రమే భవిష్యత్ తెలంగాణ, భారతదేశానికి సాధికారతను అందిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఎక్స్ వేదికగా ‘ఆస్క్ కవిత’ (Ask Kavitha) అనే కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. పలువురు నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే, గతంలో ఏ నాయకుడూ చేయనది కొత్తగా రాష్ట్రానికి ఏం చేస్తారని ఓ నెటిజన్ ప్రశ్నించగా ఆమె ఈ సమాధానం ఇచ్చారు.
2029 ఎన్నికల్లో పోటీ చేస్తారా?
2029 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కవిత చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించవచ్చా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. ‘ అక్కా.. మీరు మంచి వక్త. కానీ, రాష్ట్రంలో ఇన్ని రాజకీయ పార్టీల మధ్య మనుగడ సాగించగలరని భావిస్తున్నారా?’ అని ఓ వ్యక్తి ప్రశ్నించగా, ‘మనుగడ సాగించగలను’ అని కవిత సమాధానం ఇచ్చారు. ఎస్సీ, ఎస్సీ, ఎంబీసీ వర్గాలకు భవిష్యత్ రాజకీయాల్లో అవకాశాలు కల్పించే ఉద్దేశం ఏమైనా ఉందా? అని ప్రశ్నించగా, కచ్చితంగా కల్పిస్తానని కవిత చెప్పారు. సమగ్రమైన, అందరికి సాధికారత కల్పించేలా సమాజంలోని అన్ని వర్గాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జాగృత లక్ష్యాలు ఈ అంశాలను ప్రతిబింబిస్తాయని ఆమె పేర్కొన్నారు.
Read Also- Bigg Boss Telugu 9: ఐదుగురు హౌస్‌మేట్స్‌తో ఎమోషనల్ డ్రామా మొదలైంది.. సంజన, తనూజ ఔట్!
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అభిప్రాయం ఏంటి?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటని ఓ వ్యక్తి ప్రశ్నించగా, జనాలు తీవ్రమైన నిరాశలో ఉన్నాయని కవిత సమాధానం ఇచ్చారు. వాగ్దానాలను నెరవేర్చడం లేదని, అంకితభావంతో పనిచేయడం లేదని ఆరోపించారు.
తెలంగాణ జాగృతి సభ్యత్వాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే తేదీలు వెల్లడిస్తామని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2025లో తెలంగాణ యువత దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి?, ఉద్యోగాలు, నైపుణ్యాలు, భద్రత.. వీటిలో మీ ఆప్షన్ ఏది? అని ఓ వ్యక్తి ప్రశ్నించగా, జాబ్స్ అని కవిత సమాధానం ఇచ్చారు. భద్రత కూడా కచ్చితంగా కల్పించాలన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలోనూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వీటిపై మీ ఉద్దేశం ఏమిటి?, బాధిత కుటుంబాలను పరామర్శించారా? అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. కవిత స్పందిస్తూ, తెలంగాణలో ఇంకా ఆత్మహత్యలు కొనసాగుతుండడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్‌లో పత్తి రైతు కుటుంబాన్ని కలిశానని, పంట నష్టం జరిగి, అప్పు తీర్చలేక ఆ రైతు చనిపోయారని ఆమె వివరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమే రైతుల ఆత్మహత్యలు ఆమె అని వ్యాఖ్యానించారు.
Read Also- Bharani Emotional: బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత భరణి ఎమోషనల్.. ఏం చెప్పారు అంటే?
సినీ నటుడు రామ్‌చరణ్‌పై మీ అభిప్రాయం ఏంటి?
సినీ నటుడు రామ్‌చరణ్‌పై ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా కవిత ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. వ్యక్తిగతంగా చాలా వినయంగా ఉంటారని, ఆయనొక అద్భుతమైన డ్యాన్సర్ అని ప్రశంసించారు. అయితే, తాను మెగాస్టార్ చిరంజీవి అభిమానిని కాబట్టి, చిరంజీవి కంటే రామ్‌చరణ్ గొప్ప కాదని కవిత వ్యాఖ్యానించారు.

