MLAs Dissatisfaction: సీఎల్పీ మీటింగ్ తర్వాత ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. నియోజకవర్గాల డెవలప్ మెంట్ కు ఆశించిన స్థాయిలో మంత్రులు చొరవ తీసుకోవడం లేదని చెప్తున్నారు. నిధులు కేటాయించాలని, తాము ఎన్ని సార్లు ప్రపోజల్స్ పెట్టినా, పెద్దగా పట్టించుకోవడం లేదని వివరిస్తున్నారు. ఇదే విషయాన్ని పీసీసీకి కూడా చెప్పినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ సమస్యను చవి చూస్తున్నట్లు పీసీసీ దృష్టికి వచ్చింది. నియోజకవర్గాల అభివృద్ధి పై ఫోకస్ పెట్టకపోతే తాము నష్టపోతామంటూ పలువురు ఎమ్మెల్యేలు తాజాగా పీసీసీకి వివరించారు. జపాన్ టూర్ తర్వాత సీఎంకు వివరించాలని నిర్ణయం తీసుకున్నారు.
రిపిటెడ్ గా ఈ సమస్యను ఎదుర్కుంటున్నామని, ఇప్పటికీ డెవలప్ మెంట్ వర్క్స్, ప్రోగ్రామ్ లను జాప్యం చేస్తే ప్రజల నుంచి ఆగ్రహం ఎదురయ్యే ప్రమాదం కూడా ఉన్నదని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పీసీసీ చెప్పినట్లు సమాచారం. సీఎం జిల్లా టూర్లలో సమన్వయంగా సమస్యలకు చెక్ పెడుతూనే, డెవలప్ మెంట్ లకు ప్రత్యేక నిధులు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని ఆయన పీసీసీని కోరారు.
మంత్రులు తమ సొంత నియోజకవర్గాలపై పెట్టిన ఫోకస్ , ఇతర సెగ్మెంట్లపై పెట్టడం లేదనేది ఎమ్మెల్యేల వాదన. కంపెనీలు, సంస్థలు, ఇతర ప్రాజెక్టులు ఏవీ వచ్చినా, సొంత నియోజకవర్గంలోనే ఏర్పాటు చేసుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. మిగతా నియోజకవర్గాల పరిస్థితి తమకు తెలియనట్లు మంత్రులు వ్యవహరిస్తున్నారని టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. ఏడాదిన్నర నుంచి తాము చేయాలనుకుంటున్న వర్క్స్, నియోజకవర్గాల్లో డెవలప్ మెంట్ వంటి వాటిలో నిర్లక్ష్యం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also read: CM Revanth in Japan: విదేశీ పర్యటనలో సీఎం.. రాష్ట్రానికి రానున్న మరిన్ని పెట్టుబడులు!
అధికారులను అడిగినా, మంత్రి నుంచి ఆదేశాలు లేవని దాటవేస్తున్నారని మరో ఎమ్మెల్యే చెప్పారు. దీంతో చేసేదేమీ లేక మంత్రుల కార్యాలయాలు, క్యాంప్ ఆఫీస్ లు, సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని వెల్లడించారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రజలు తమను అడుగుతున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేర్చాలని ప్రెజర్లు పెరుగుతున్నట్లు చాలా మంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే, అసంతృప్తి ఎందుకు రాదని ఎమ్మెల్యేలు అంతర్గతంగానే అసంతృప్తిని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇదే విషయాన్ని సీఎల్పీ సమావేశంలోనే వెల్లడించాలని పలువురు ఎమ్మెల్యేలు ట్రై చేశారట. కానీ సీనియర్ల సూచన మేరకు పార్టీ, సీఎం చెప్పిన ఆదేశాలకు ఎస్ చెప్తూ బయటకు రావాల్సి వచ్చిందని మరో ఎమ్మెల్యే వివరించారు.
ఇక ఎన్నికల సమయంలో పార్టీ మేనిఫెస్టోలతో పాటు ఆయా నియోజకవర్గాల పరిస్థితులు, అవసరాలు, సౌకర్యార్ధం అనేక డెవలప్ మెంట్ పనులకు హామీలు ఇచ్చామని, కానీ ఏడాదిన్నరగా జాప్యం జరుగుతుండటంతో ఏం చెప్పాలో అర్ధం కావడం లేదని ఎమ్మెల్యేలు మొరపెట్టుకుంటున్నారు. పైగా తాజాగా జరిగిన సీఎల్పీ మీటింగ్ లో ఫైనాన్స్ పరిస్థితులు, రాష్ట్ర ఆర్ధిక ఆదాయం, అప్పులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తమ నోర్లు మూయించారని మరో శాసన సభ్యుడు వివరించారు. ఓవరల్ గా డెవలప్ మెంట్ విషయంలో మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు అనే స్థాయిలో ఫైట్ కొనసాగుతున్నది.
స్వేచ్ఛ E -పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/