MLA Satyanarayana’s Wife: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampally Satyanarayana)కు మంత్రి పదవి రాకపోవడంపై ఆయన సతీమణి అనురాధ (Dr. Anuradha) సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యనారాయణ బర్త్ డే వేడుకల్లో మాట్లాడిన ఆమె.. తన భర్తను తొక్కేశామని కొందరు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అది వారి బలహీనతేనని విమర్శించారు. అటు ఎమ్మెల్యే సైతం ఈ అంశంపై మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఆ దేవుడు ఇవ్వలేదని ఆవేదన చెందారు. మానకొండూరు ప్రజలకు మాత్రమే సేవ చేయాలని రాసి పెట్టి ఉందని వ్యాఖ్యానించారు.
మంగళవారం అల్గునూరులోని ఉన్నతి కన్వెక్షన్ లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలను (MLA Birthday Celebrations) నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు తన భర్త బర్త్ డే వేడుకల్లో డాక్టర్ అనురాధ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆమె మాట్లాడుతూ కవ్వంపల్లి కుటుంబానికి బాధలు కొత్తేమీ కాదని ఎన్నో ఆటుపోట్లు, అవరోధాలను అధిగమిస్తూ ఈ స్థితికి వచ్చామని అన్నారు. కాలం కలిసొస్తే కవ్వంపల్లి మంత్రి అయ్యే వారని, ఇదే జరిగి ఉంటే ఈ వేడుక మరింత వైభవోపేతంగా జరిగేదంటూ భావోద్వేగానికి గురయ్యారు.
Also Read: MLC Kavitha: తెలంగాణలో సంచలనం.. పోలీసుల అదుపులో కవిత.. ఎందుకంటే?
ఒక వ్యక్తిని ఎదగకుండా తొక్కేయాలనుకోవడం బలం కాదని.. అది వారి బలహీనతే అవుతుందనే విషయాన్ని గ్రహించుకోవాలని అనురాధ వ్యాఖ్యానించారు. ప్రజాభిమానంతో ఎదిగే వారిని ఎవరూ అణచివేయలేరని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు చూపుతున్న ప్రేమ, ఆదరాభిమానాలతో ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ కవ్వంపల్లి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారని అన్నారు. తన భర్త రాజకీయాల్లోకి రావడం తనకు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదని.. రాజకీయ ప్రవేశం చేశాక అవకాశాలు రాక ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.