చౌటుప్పల్ స్వేచ్ఛ: MLA Rajagopal Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని మహాభారతంలో ధర్మరాజుగా ఊహించుకుంటే తను మాత్రం ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. చౌటుప్పల్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
పదవి అనేది అలంకారం కాదని, ఒక బాధ్యతన్నారు. టీమిండియాలో ఇద్దరు అన్నదమ్ములు ఆడలేదా? వంద కోట్ల జనాభాలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు దేశం కోసం ఆడగాలేనిది, తెలంగాణలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే మంత్రి పదవి తీసుకోవద్దా? అని ప్రశ్నించారు. జానారెడ్డి ప్రత్యక్ష్యంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ అధిష్టానానికి లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. 30 ఏండ్ల పాటు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇయ్యాళ గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు.
Also Read: Kancha Gachibowli Land: మంత్రుల మౌనరాగం.. అసలు కారణం ఇదేనా?
రాజగోపాల్ రెడ్డి అంటే గల్లా ఎగరేసుకుని ఉంటాడే తప్ప అడుక్కునే పొజిషన్‌లో ఉండబోడని తెలిపారు. మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చిందని, భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని మరోసారి హామీనిచ్చారని గుర్తు చేశారు. మంత్రి పదవి ఇస్తే కిరీటం కాదు. ఒక బాధ్యతగా వ్యవహరిస్తానని చెప్పారు. రాబోయే రోజుల్లో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ పరిధిని పెంచి రైతులకు ఇంకా మంచి చేసే కృషి చేస్తానన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుందని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. కరెంటు గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి లేదని, కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంటు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు. రైతు రుణమాఫీ కొంతమంది రైతులకు ఇవ్వాల్సి ఉంది అది వాస్తవమేనని తెలిపారు.
మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి నీరు అందించే బాధ్యత రాజగోపాల్ రెడ్డిదేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Bhatti Vikramarka: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సిద్ధంగా ఉండండి!