MLA Kaushik Reddy: మొంథా తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కేవలం ‘కంటితుడుపు చర్యలు’ కాకుండా కష్టకాలంలో ఆదుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) డిమాండ్ చేశారు. పంట నష్టాన్ని పరిశీలించేందుకు శనివారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన, ప్రభుత్వం ప్రకటించిన రూ.10,000 నష్టపరిహారం *’రైతులను అవమానించడమే’*నని విమర్శించారు. హుజురాబాద్(Huzurabad) నియోజకవర్గంలోనే 30 వేల ఎకరాలకు పైగా వరి(Pady), పత్తి(Cotton) పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలు ఉన్నప్పటికీ, అధికారులు కేవలం 825 ఎకరాలు మాత్రమే నష్టపోయినట్లు నివేదికలు ఇవ్వడం దారుణమని కౌశిక్ రెడ్డి అన్నారు.
అధికారులు నామమాత్రంగా..
వ్యవసాయ శాఖ(Department of Agriculture) అధికారులు నామమాత్రంగా కాకుండా, క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి, వాస్తవ నివేదికలు ఉన్నతాధికారులకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహిస్తే తాను స్వయంగా పరిశీలిస్తానని హెచ్చరించారు. రైతుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఆయన కొన్ని కీలక డిమాండ్లు చేశారు.
Also Read: Baahubali The Epic: ‘బాహుబలి ది ఎపిక్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా.. ఆ రికార్డులు బ్రేక్..
కీలక డిమాండ్లు..
వరి పంటకు ఎకరానికి రూ. 25,000 నష్టపరిహారం.
పత్తి పంటకు ఎకరానికి రూ. 50,000 నష్టపరిహారం.
ఎన్నికల మేనిఫెస్టో హామీలైన రైతు భరోసా బోనస్, రూ. 2 లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ తక్షణమే చెల్లించాలి.
కౌలు రైతులకు రూ. 76 వేలు, రైతు కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 చెల్లించాలనే హామీని నెరవేర్చాలి.
ఆటో కార్మికులకు..
నిరుద్యోగులు, విద్యార్థులు, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో అన్ని హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వంపై నిరంతరం పోరాటం చేస్తానని హెచ్చరించారు. హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వకుండా ప్రజలు అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read: Baahubali re-release: ప్రభాస్‘బాహుబలి ది ఎపిక్’ అక్కడ ఫెయిల్ అయిందా!.. ఎందుకంటే?
