Urea Production: రామగుండంలో ఉత్పత్తి అవుతున్న యూరియాలో 70 శాతం కేటాయిస్తే బాగుండేది
రైతులకు వేగంగా ఎరువులు అందించవచ్చు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు
రామగుండం ఎరువుల కంపెనీ అధికారులతో యూరియా ఉత్పత్తిపై సమీక్ష
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో నెలకు సుమారు లక్ష టన్నుల యూరియా ఉత్పత్తి అవుతున్నప్పటికీ (Urea Production) తెలంగాణకు కేవలం 40 నుంచి 50 శాతం మాత్రమే కేటాయింపులు జరుగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) వెల్లడించారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 70 శాతం తెలంగాణకు కేంద్రం కేటాయిస్తే బాగుండేదని, రైతులకే వేగంగా ఎరువులు అందించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మంగళవారం నాడు సచివాలయంలో ఆర్‌ఎఫ్‌సీఎల్( రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్ ) అధికారులతో మంగళవారం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఉత్పత్తిలో ఎటువంటి అవాంతరాలు వచ్చినా, ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కంపెనీ ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. గత ఖరీఫ్ సీజన్‌లో రామగుండంలో ఎరువుల ఉత్పత్తి నిలిచిపోవడంతో తెలంగాణ రైతులకు యూరియా సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురైన విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ నుంచి 2,05,315 మెట్రిక్ టన్నుల కేటాయింపులకు గాను కేవలం 1,10,720 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా కావడం వల్ల లోటు ఏర్పడిందని తెలిపారు. ఈ లోటును భర్తీ చేయాలని కేంద్రాన్ని పలుమార్లు కోరినప్పటికీ సమయానికి స్పందన లేకపోవడం వల్ల రైతులు నష్టపోయారని అన్నారు.
పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రబీ సీజన్‌కు సంబంధించి ఆర్ఎఫ్‌సీఎల్ తీసుకుంటున్న చర్యలు, ఉత్పత్తిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చేపడుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. దీనికి స్పందించిన కంపెనీ ప్రతినిధులు, గత ఖరీఫ్‌లో హెచ్‌టీఆర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా ఉత్పత్తి నిలిచిపోయిందని, రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులకు చింతిస్తున్నామని తెలిపారు. ఈ రబీలో ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో కేటాయింపుల మేరకు యూరియాను సరఫరా చేశామని, డిసెంబర్ నెలలో కూడా 50,450 మెట్రిక్ టన్నుల సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
Read also- Gadwal News: పంచాయతీ పోరులో గొంతు విప్పుతున్న యువగళం.. ఎన్నికల బరిలో నిలిచిన యువత
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రామగుండంలో ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 70 శాతం అయినా తెలంగాణకే కేటాయిస్తే రవాణా ఖర్చులు తగ్గి, రైతులకు వేగంగా ఎరువులు అందించవచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని పరిశ్రమల శాఖ ఎండీని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. అలాగే ఉత్పత్తిలో ఎలాంటి అవాంతరాలు వచ్చినా ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఎన్‌ఎఫ్‌ఎల్ కంపెనీ ప్రతినిధులను మంత్రులు ఆదేశించారు.

