Panta Bheema Scheme: తేది 23.04.2025 నాడు సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి , వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు మరియు ఇతర అధికారులతో పంటల బీమా పథకం అమలుకు సంబంధించిన ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో ఈ పథకం కింద రైతులందరికి బీమా అందేలా మరియు ఏఏ పంటలకు బీమా పథకాన్ని వర్తింపచేయాలనే విషయాలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా వానాకాలం మరియు యాసంగి కాలాల్లో ఏఏ పంటలకు ఏఏ విపత్తుల కింద బీమా వర్తింపచేయాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు.
నష్టం కలిగే సంభావ్యత ఆధారంగా రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించడం జరిగిందని, సాధారణంగా వానాకాలం
సీజన్ లో సుమారు 128 లక్షల ఎకరాలు పంటలు వేయడం జరుగుతుందని, వాటిలో వరి 66.78 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 5.23, పత్తి 44.75, మిర్చి 1.90, సోయాబీన్ 3.80, కంది 5.21 లక్షల ఎకరాలు సాగవగా, యాసంగి పంటకాలంలో మొత్తం 78 లక్షల ఎకరాలల్లో పంటలు సాగవగా, వరి 59 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 9, వేరుశనగ 2.2, శనగ 1.7 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారులు మంత్రికి వివరించారు.
Also read: CM Revanth Reddy: హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటీషన్.. కేసు కొట్టివేయాలని వినతి!
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం మార్గదర్శకాల ప్రకారంగా వానాకాలానికిగాను మొత్తం ప్రీమియంలో రైతు వాటా 2 శాతం, యాసంగి పంటకాలంలో 1.5 శాతం, వాణిజ్య మరియు ఉద్యానపంటలకు గాను 5 శాతం ప్రీమియం ఉంటుందని, మిగిలిన ప్రీమియంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం 50:50 భరించడం జరుగుతుందని తెలిపారు. రైతులందరికి పంటల బీమా వర్తింపచేయడం వలన స్థూల పంట విస్తీర్ణంలోని 98 శాతం విస్తీర్ణానికి బీమా వర్తిస్తుందని మంత్రిగారికి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వాతావారణ మార్పుల వలన ప్రధానంగా అకాల వర్షాల వలనగాని, అధిక వర్షాల వలన గాని, వడగండ్ల వానల వలన, వర్షాభావ పరిస్థితుల వలన గాని కలిగే పంట నష్టానికి పంటల బీమా వల్ల రైతులకు కలిగే నష్టాన్ని కొంతవరకు భర్తీచేసే అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దిగుబడి ఆధారిత బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్, వేరుశనగ, శనగ, నువ్వులు, మొదలైన పంటలు మరియు వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పత్తి, మిరప, మామిడి, ఆయిల్ పామ్, టమాట, బత్తాయి మరియు మొదలైన పంటలకు బీమా వర్తింపచేసే విషయంలో పూర్తిస్థాయిలో రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోని పథకాన్ని రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు.
Also read: Pahalgam Terrorist Attack: పహల్గాం ఉగ్రదాడి.. ప్రభాస్ సినిమాపై తీవ్ర ఒత్తిడి!
ఎండాకాలంలో వడగళ్ల వర్షం వలన నష్టపోయే వరి మరియు మామిడి వంటి ప్రధాన పంటలకు పూర్తి స్థాయి నష్ట పరిహారాన్ని రైతులకు అందించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అమలుచేస్తున్నాయో అధ్యయనం చేసి, రైతులందరికి ప్రయోజనం చేకూరే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా టెక్నాలజీ ఆధారంగా పంటల దిగుబడి అంచనాలను రూపొందించడం మరియు నష్టపోయిన పంటల విషయంలో బీమా కంపెనీలు సత్వరమే బీమా క్లెయిమ్ అందించుటకు గల విధివిధానాలను రూపొందించాలని సూచించారు. వానాకాలం మరియు యాసంగి పంటలకు సంబంధించి రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా అన్ని రకాల ప్రధాన పంటలకు బీమా ప్రీమియం అంచనా వేయుటకు వెంటనే తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.