Thummala Nageswara Rao: పత్తికొనుగోళ్లపై అధికారులు పర్యవేక్షణ చేయాలని, రైతులు దళారులు దగ్గర మోసపోకుండా సీసీఐ వద్ద మాత్రమే పత్తి అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) సూచించారు. సచివాలయంలో వ్యవసాయశాఖ, మార్క్ ఫెడ్, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పీఎస్ఎస్ స్కీమ్ లో సొయా చిక్కుడు, పెసర కొనుగోళ్లకు కూడా కేంద్రం నుంచి అనుమతులు రాని నేపథ్యంలో మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పత్తిలో తేమ శాతం తాగించి సరైన గిట్టుబాటు ధర పొందేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
Also Read:Thummala Nageswara Rao: మహిళా శక్తి చీరలు పంపిణీకి సిద్ధం చేయాలి.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
నిబంధనలలో 8-12% తేమ శాతం సడలించాలి
తేమ శాతం పరీక్షించే పరికరాలు అందుబాటులో ఉంచాలని, మార్కెట్ యార్డులలో సరిపడా యంత్రాలు, పరికరాలు, సిబ్బంది ఉండేలా చూడాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో సీసీఐ నిబంధనలలో 8-12% తేమ శాతం సడలించాలని కేంద్ర అధికారులను కోరారు. ఈ నామ్ సర్వర్ లో ఏర్పడుతున్న సమస్యతో కొన్ని జిల్లాల్లో రైతులు ఇబ్బంది పడ్తున్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పక్క రాష్ట్రాల్లో ఎంఎస్పీ అమలు చేయకపోవడంతో, సరిహద్దు ప్రాంతాల్లోని రైతులు తమ పంటను తెలంగాణ మార్కెట్లలో అమ్మడంతో స్థానిక రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా అలా తీసుకువచ్చి అమ్మాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి , మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీ భాయి పాల్గొన్నారు.
చేనేత కళా వైభవానికి వేదికగా హైదరాబాద్ శారీ ఫెస్టివల్.. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
భారతీయ చేనేత కళా వైభవానికి హైదరాబాద్ మరోసారి వేదిక అయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆమీర్‌పేట్‌లోని కమ్మ సంఘం ప్రాంగణంలో నిర్వహిస్తున్న’హైదరాబాద్ శారీ ఫెస్టివల్’ను శనివారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 30వ తేదీ వరకు ఈ ఫెస్టివల్ కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ శారీ ఫెస్టివల్ కేవలం ప్రదర్శన మాత్రమే కాదు. ఇది ఒక సాంస్కృతిక పరస్పర మాధ్యమం అన్నారు. సంప్రదాయ డిజైన్‌లు, సూక్ష్మ నేత పద్ధతులు, ప్రాంతీయ ప్రత్యేకతలు తెలుసుకోవచ్చు అని, చేనేత చీరలను ప్రోత్సహించడం, కళాకారులకు మార్కెట్ అవకాశాలు కల్పించడం, ఫ్యాషన్‌పై అవగాహన కల్పించడం ఈ ప్రదర్శన ప్రధాన లక్ష్యం అని తెలిపారు.
