Minister Sridhar Babu: విద్యార్థులు సక్సెస్ సాధించాలంటే టెక్నాలజీలో మంచి ప్రావీణ్యం సంపాదించాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) సూచించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని టీ-సాట్ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ‘రాష్ట్ర స్థాయి వార్షిక పోటీలు-2025’ విజేతల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సమాజంలో అత్యంత వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త విషయాలు నేర్చుకుంటూ విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు సాధించాలని, ప్రస్తుత కాలంలో విద్యార్థుల సాంకేతిక పరిజ్ణానాన్ని అంచనావేయలేకపోతున్నామన్నారు.
విద్యార్థుల్లో నైపుణ్యం
విద్యార్థుల మేథో సంపత్తికి టి-సాట్(T-SAT) సాంకేతికను ఉపయోగించుకుని తమ తమ భవిష్యత్ కు గట్టి పునాదులు వేసుకోవాలని సూచించారు. విద్యార్థులు విజయం సాధిస్తే టీచర్లు మొదటగా, ఆ తరువాత తల్లిదండ్రులు సంతోషిస్తారని, చదువుల్లో మొదటి స్థానమే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చాలా ముఖ్యం అని, విద్యార్థుల్లో నైపుణ్యం వెలికి తీసేందుకు ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి(Venugopal Reddy) మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మంత్రి శ్రీధర్ బాబు టి-సాట్ కు సంపూర్ణ మద్దతు అందచేస్తూ, తెలంగాణ విద్యార్థులు, యువతకు పరోక్షంగా చేయూనిస్తున్నారని కొనియాడారు. ప్రతి రోజా గంట పాటు విద్యార్థులు టి-సాట్ నెట్వర్క్ ను చూడాలని కోరారు. ప్రతి రోజు ఒక్క గంటైనా టి-సాట్ ప్రసారాలు చూడాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమానికి టి-సాట్ ఎగ్జుక్యూటీవ్ డైరెక్టర్ ఎం.డి సాధిక్ స్వాగతోపన్యాసం చేయగా జనరల్ మేనేజర్ లింగారెడ్డి వందన సమర్పన చేశారు.
Also Read: Telangana Govt: టీచింగ్ సిబ్బందికి తీరనున్న భారం.. రాష్ట్ర విద్యాశాఖ సమాలోచనలు
విజేతలు వీరే..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘రాష్ట్ర స్థాయి వార్షిక పోటీలు 2025’ పేరుతో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు గురువారంతో ముగిసాయి. నవంబర్ నాల్గవ తేది నుండి 13వ తేది వరకు మండల, జిల్లా, జోనల్ స్థాయితో పాటు బుధ, గురువారాల్లో టి-సాట్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో 33 జిల్లాల నుండి జిల్లాకు ఒకరు చొప్పున 33 మంది విద్యార్థులు పాల్గొనగా వక్తృత్వ పోటీల్లో 31 జిల్లాల నుండి 31 మంది పాల్గొన్నారు. క్విజ్ ప్రథమ విజేతగా రాజన్న సిరిసిల్ల జోన్, ద్వితీయ విజేతగా కాలేశ్వరం జోన్ నిలవగా, మూడవ స్థానంలో బాసర జోన్ నిలిచింది. జోగులాంగ గద్వాల జోన్ సైతం అత్యంత ప్రతిభ కనబరిచి ప్రత్యేక విజేతగా నిలిచింది. రాష్ట్రంలోని ఏడు జోన్ల నుండి ఒక్కో జోన్ కు ఐదుగురు విద్యార్థులతో కూడిన టీం చొప్పున 35 మంది విద్యార్థుల మద్య ఏడు జోన్లకు క్విజ్ పోటీలు జరిగాయి. వక్తృత్వ (బాలవ్యక్త) పోటీల్లో ప్రథమ విజేతగా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థి కె.కేశవర్థన్ నిలిచారు. రెండవ స్థానంలో మేడ్చల్ మల్కాజ్ గిరికి చెందిన కె.వి.యషశ్విని ద్వితీయ, నిర్మల్ జిల్లాకు చెందిన వంగా వెంకటకృష్ణ తృతీయ విజేతలుగా నిలిచారు. వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ టి-సాట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్లను అందచేసి ప్రోత్సహించింది.
