Seethakka: గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Seethakka) స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో గ్రామీణ తాగునీటి సరఫరాపై ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమస్యలు తలెత్తిన తర్వాత స్పందించడం కంటే, ముందుచూపుతో ప్రణాళికలు రూపొందించి జాగ్రత్తలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎక్కడైనా పంపు సెట్లు పాడైతే వెంటనే మరమ్మతులు చేపట్టాలని, చిన్న చిన్న లోపాల వల్ల ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వేసవి కాలంలో ఎక్కడా తాగునీటి కొరత రాకుండా అన్ని స్థాయిల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Also Read: Seethakka: సమ్మక్క చిలకలగుట్ట పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిది : మంత్రి సీతక్క!
మేడారంపై ప్రత్యేక దృష్టి
త్వరలో జరగనున్న మేడారం మహా జాతరను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను సీతక్క (Seethakka) ఆదేశించారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి నీటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులను ప్రత్యేకంగా నియమిస్తామని, ఈ నెల 10న మేడారంలో క్షేత్రస్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇదే సమయంలో, కొన్ని చోట్ల అవసరం లేకపోయినా కొత్త బోర్లు వేయాలని ప్రోత్సహించే సిబ్బందిపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అనవసరపు బోర్ల వల్ల ప్రభుత్వ ధనం, శ్రమ వృథా అవుతాయని, ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రిజర్వాయర్లలో నీటి లభ్యతను అంచనా వేస్తూ నిరంతర సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు.
Also Read: Seethakka: ఉపాధి హామీపై కేంద్రం పెత్తనం ఏంటి? మంత్రి సీతక్క ఫైర్!

