Minister Seethakka: చిలకలగుట్ట, ట్రైబల్ మ్యూజియంను రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క(Minister Seethakka) సందర్శించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో మేడారంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
మద్యం సేవించి..
జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్ పి సుధీర్ రామ్ నాథ్ కేకన్ లతో కలిసి మేడారం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా చిలకలగుట్ట ప్రాంతాన్ని సందర్శించి అక్కడ భక్తుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించి, అక్కడ చేపడుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మద్యం సేవించి జంపన్న వాగులోకి వెళ్లవద్దని భక్తులను సూచించారు. అలాగే మేడారం చేరుకున్న వెంటనే జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం అమ్మవార్ల దర్శనం చేసుకుని వంటావార్పు నిర్వహించుకోవాలని తెలిపారు.
Also Read: Medaram Jatara 2026: మేడారం జాతర స్పెషల్.. 4,000 ఆర్టీసీ బస్సులు.. మంత్రి పొన్నం ప్రకటన
మంత్రి సీతక్క మాట్లాడుతూ..
రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే జాతర సమయంలో చిన్నపిల్లలు, వృద్ధులను ఒంటరిగా ఎక్కడికీ వదిలివేయకూడదని మంత్రి స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసే ఉండాలని, ఎవరికైనా దారి తప్పితే వెంటనే సమీపంలోని పోలీసు సిబ్బందిని లేదా అధికారులను సంప్రదించాలని సూచించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, దర్శన సౌకర్యాలు వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భక్తుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

