Anganwadi centers: నవంబర్ 19లోపు నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా అంగన్వాడీ కేంద్రం భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని మంత్రి సీతక్క(Min Sethakka) అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమశాఖపై సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ సేవల పని తీరు మెరుగుదల, పోషకాహార లోప నివారణ కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై సమీక్షించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సీఎం ఆలోచనలకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దే విధంగా పనిచేయాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని, వానలకు భవనాలు నాని పెచ్చులూడే ప్రమాదం ఉందని అలాంటి భవనాలను గుర్తించి తక్షణం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని చోట ప్రైవేట్ భవనాలోకి మార్చాలని సూచించారు.
హాజరు శాతాన్ని పెంచాలి
కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంతో కొన్నిచోట్ల చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా అధికారులు అంగన్వాడి కేంద్రాలను విధిగా సందర్శించాలని, హాజరు శాతాన్ని పెంచాలని ఆదేశించారు. దేశంలో అంగన్వాడి సేవలను ప్రవేశపెట్టిన ఇందిరా గాంధీ(Indira Gandhi) జయంతి నవంబర్ 19 అని, ఆలోగా వెయ్యి నూతన అంగన్వాడీ భవనాలను ప్రారంభించుకునే విధంగా నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. నిధులు సరిపోకపోతే అదనంగా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఫీడింగ్, టీచింగ్, అటెండెన్స్ పై యంత్రాంగమంతా దృష్టి సారించాలని ఆదేశించారు.
Also Read: Reservation Ordinance: 30 రోజుల్లో రిజర్వేషన్లు చేయాలని సూచన!
నియామకపత్రాలు అందజేత
టీజీపీఎస్సీ(TGPSC)తో నియామకమైన 23 మందికి నియామకపత్రాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీడీపీఓ(CDPO)లు మహిళా శిశు సంక్షేమ శాఖ వెన్నెముక లాంటివారన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ సేవా దృక్పథంతో, మానవతతో పనిచేసే శాఖ అని తెలిపారు. అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. శిశువులు మహిళల సంరక్షణతో పాటు దత్తత ప్రక్రియ, మహిళా సాధికారత వంటి అంశాలను నిర్వర్తించాల్సి ఉంటుందని, అంగన్వాడి సేవలు పేదలకు అవసరం అన్నారు. అంగన్వాడీ లబ్ధిదారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించే బాధ్యత మీపైనే ఉందన్నారు. కార్యాలయాలకే పరిమితం కాకుండా ఫీల్డ్ విజిట్ చేయాలని, అంగన్వాడి సేవలు మెరుగుదలకు మీరు సలహాలు సూచనలు ఇవ్వవచ్చు అని, ఎలాంటి రాజకీయ ఒప్పులకు లొంగాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా పనిచేయండి అని సూచించారు. సమావేశంలో శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ సృజన, జేడీలు, ఆర్జేడీలు పాల్గొన్నారు.
Also Read: Sarcoma Signs: ఈ 5 లక్షణాలు మీలో ఉన్నాయా? సార్కోమా క్యాన్సర్ కావొచ్చు!